పెళ్లిచూపులు రిలీజైన రోజే  కొత్త సినిమా ప్రారంభం

పెళ్లిచూపులు రిలీజైన రోజే  కొత్త సినిమా ప్రారంభం

హైదరాబాద్: "పెళ్లి చూపులు", "డియర్ కామ్రేడ్", "దొరసాని" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రాన్ని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పిట్ట కథ చిత్రంతో ప్రతిభవంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చెందు ముద్దు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా దర్శకులు తరుణ్ భాస్కర్ కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. అలాగే మొదటి షాట్ కు దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ... "మా మొదటి సినిమా పెళ్లి చూపులు విడుదలైన తేదీ జూలై 29. అదే రోజున మా కొత్త చిత్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. పిలిచిన ప్రతి ఒక్కరూ మా కార్యక్రమానికి అతిథులుగా వచ్చి, మా టీమ్ కు  విశెస్ తెలియజేశారు. మా సంస్థలో ఆరో సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది. అంతా కొత్తవాళ్లే నటిస్తున్న ఈ సినిమాకు కథే స్టార్. చాలా ఫ్రెష్ గా ఉండే సబ్జెక్ట్ తో దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్  ప్రారంభిస్తాం. అమలాపురం, అరకు ప్రాంతాల్లో  నెల రోజులు షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత సెప్టెంబర్ లో కేరళ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్ వరకు ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తాం". అన్నారు. 

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ..."నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. చెందు ముద్దును కలిసినప్పుడు ఈ స్టోరీ చెప్పారు. ఆయన ఓ పిట్ట కథ సినిమా నాకు బాగా నచ్చింది. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈ సబ్జెక్ట్ విన్నాక నా కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనిపించింది. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం అనే నమ్మకం కలిగింది. ఈ సినిమాతో ఓ విజయాన్ని ఇచ్చి నిర్మాతకు, దర్శకుడికి థాంక్స్ చెప్పుకుంటాం". అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ..."పల్లెటూరి నేపథ్యంగా సాగే చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు కథలో ఉన్నాయి. చెందు చేసిన ఓ పిట్ట కథ నా ఫేవరేట్ మూవీ. ఈ స్టోరీతోనూ ఆయన ఓ మంచి సినిమా చేస్తారని నమ్మకం కలిగింది. ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది". అని చెప్పింది.

నటి ఉత్తర మాట్లాడుతూ...మా సినిమాకు మంచి స్క్రిప్ట్ కుదిరింది. ఈ చిత్రంలో నేనొక కీలక పాత్రలో నటిస్తున్నాను. మాలాంటి న్యూ టాలెంట్ కు అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ గారికి థాంక్స్. 

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ...విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ ఇది. మా టీమ్ అంతా కొత్తవాళ్లం. ఒక కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్, లొకేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఒక హిట్ సినిమాను మా నిర్మాత యష్ గారికి ఇవ్వబోతున్నాం. అన్నారు.