సుప్రీంకోర్టుకు బెజవాడ సాయికృష్ణ డెత్ కేసు : విచారణ తీరుపై ఆగ్రహం

సుప్రీంకోర్టుకు బెజవాడ సాయికృష్ణ డెత్ కేసు : విచారణ తీరుపై ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ సాయి కృష్ణ డెత్ కేసు ఇప్పుడు మరో సారి దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లాకప్ డెత్ తోపాటు శవాన్ని మాయం చేసిన అంశంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ  కేసులో ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసుల విచారణ తీరును తప్పుబట్టింది దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. విచారణను ఇక నుంచి మేమే చేపడతాం.. ఈ కేసును మేమే చూసుకుంటాం అని చెబుతూ.. ఏపీ హైకోర్టు విచారణపై స్టే విధించింది సుప్రీంకోర్టు. కేసును తక్షణమే సుప్రీం కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

గాదె సాయికృష్ణ డెత్ కేసుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ విచారణ తీరును పిటీషన్ లో వివరించారు. ఈ పిటీషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జడ్జి విక్రమ్ నాథ్.. ఏపీ హైకోర్టు విచారణపై స్టే విధిస్తూ.. ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేశారు. 

2026, సెప్టెంబర్ 30వ తేదీలోపు సాయి కృష్ణ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని.. కేసుకు సంబంధించి హైకోర్టులో ఉన్న అన్ని పిటీషన్లు, రికార్డులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించారు జడ్జి. ఈ కేసు తర్వాత విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా చేశారు న్యాయమూర్తి. 

విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు కస్టడీలో సాయికృష్ణ మాయం కావడం చట్ట వ్యతిరేకమే అంటూ విచారణ తీరును తప్పుబట్టింది సుప్రీంకోర్టు. సాయికృష్ణ తల్లి కంప్లయింట్ చేస్తే FIR ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నిస్తూ.. డీజీపీ ఏం చేస్తున్నారు.. పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారంటూ నిలదీసింది సుప్రీంకోర్టు. పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయం అయితే దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తూ.. ఇది పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించింది కోర్టు. సాయి కృష్ణ మృతదేహం ఇంత వరకు దొరకలేదు అంటే.. పోలీసుల విచారణ తీరు ఎలా ఉందో అర్థం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు.