
వెరైటీ కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్తేం కాదు. కొన్ని వంటకాలు వావ్ అనేలా ఉంటే.. మరికొన్నేమో దీన్ని కూడా వంట అంటూ అనే కామెంట్లను తెచ్చిపెట్టుకుంటుంది. అదే తరహాలో ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. గుడ్లు అనగానే చాలా మంది నాన్ వెజ్ ఐటెమ్ అంటారు. కానీ కొంతమంది మాత్రం దాన్ని కూడా శాఖాహారం లాగే భావిస్తారు. అయితే శాఖాహారులై ఉండి మాంసాహరమైన గుడ్డును తినాలనిపిస్తే ఏం చేయాలో ఓ యువతి వీడియో ద్వారా ఓ కొత్త వంటకాన్ని పరిచయం చేశారు. గుడ్లు తినని వారు, తినలేని వారు ఈ రెసిపీని ట్రై చేయడంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ వీడియోలో ముందుగా ఓ మిక్సీ గిన్నెలో చనా పప్పును తీసుకుని గ్రైండ్ చేసుకోవడం చూడవచ్చు. ఈ గ్రైండ్ చేసిన పొడికి మసాలా, నూనె, నీటిని, కాస్త ఉప్పును కలిపి చిన్న ముద్దల్లా చేసుకున్నారు. మరో పక్క పన్నీర్, కార్న్ పొడిని వాటర్ తో గ్రైండ్ చేసుకుని, అందులో నల్ల ఉప్పు కలిపారు. ఆ తర్వాత దీన్ని గుడ్డులా గుండ్రగా చేసుకుని, మధ్యలో ఇంతకుమునుపు చేసి పెట్టుకున్న చనా ముద్దను పెట్టుకుని గుడ్డు ఆకారంలో చుట్టారు. ఆ తర్వాత ఓ బౌల్ లో వాటర్ ను వేడి చేసుకుని, అందులో ఈ గుడ్డు ఆకారం ఉన్న ముద్దలను వేశారు. అవి కాస్త ఉడికాక, తీసి పక్కన పెట్టుకున్నారు. మరో కడాయిలో ఆయిల్, పోపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి.. దానికి టమాటో పేస్ట్, పసుపు కలిపారు. ఈ మిశ్రమం కాస్త వేగాక దీనికి ఉప్పు, కారం, చికెన్ మసాలా కలిపారు. ఇందులో వాటర్ పోసి, కసూరి మేతిని కూడా వేశారు. చివరగా ముందు ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్డు ఆకారంలోని ముద్దలను సగానికి కట్ చేసి, కర్రీలో వేశారు.
ఆశ్చర్యకరమైన ఈ వెరైటీ వంటకం చూడడానికి అచ్చు మసాలా ఎగ్ కర్రీ లాగానే ఉంది. ఈ వీడియోపై పలువురు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. శాఖాహారం తీసుకునే వ్యక్తి గుడ్లు తినడం గురించి ఎందుకు ఆలోచిస్తాడు అని కొందరు ప్రశ్నిస్తే.. వీటితో ఆమ్లెట్ ఎలా తయారు చేయాలి? అని ఇంకొందరు అడుగుతున్నారు. శాఖాహారులు నాన్-వెజ్ ఫుడ్స్ అంటే చాలా అసూయపడతారు అని ఇంకొకరు రాసుకొచ్చారు. "నేను శాఖాహారం చికెన్ కోసం ఎదురు చూస్తున్నాను" అంటూ మరో యూజర్ వ్యంగ్యంగా అన్నారు. ఈ వెరైటీ డమ్మీ నాన్ వెజ్ మసాలా కర్రీ నచ్చితే.. మీరు కూడా ఓ సారి ప్రయత్నించండి.
https://twitter.com/chiragbarjatyaa/status/1666724067901329408