- తొలగించేందుకు భారీగా లంచాలు గుంజుతున్నరు
- పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నరని ఆవేదన
- ధరణి నుంచి భూభారతి దాకా 23 లక్షల కోట్ల స్కామ్: ఏలేటి
- బీజేపీ ఆఫీసులో 22ఏపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: ఈ ప్రభుత్వ హయాంలో 22ఏ నిషేధిత జాబితా భూదందాలకు, అవినీతి సంపాదనకు అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న చట్టబద్ధమైన పట్టా భూములు, వ్యవసాయ క్షేత్రాలు, ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నారని మండిపడ్డారు. వాటిని తొలగించుకోవాలంటే బాధితులు భారీగా లంచాలు ఇవ్వాల్సి వస్తున్నదని చెప్పారు.
సొంత ఆస్తులను కాపాడుకునేందుకు రైతులు, సామాన్యులు కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో 22ఏ అక్రమాలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) చేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ శామీర్‌పేట మండలం బొమ్రాస్‌పేటలో 1,500 ఎకరాలను ఏకపక్షంగా 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో చిన్న ప్లాట్ వివాదాన్ని సాకుగా చూపి మొత్తం సర్వే నంబర్లనే బ్లాక్ చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు నష్టపోతుంటే.. పైరవీలతో జాబితా నుంచి భూములను తొలగించుకుంటూ బడాబాబులు లబ్ధి పొందుతున్నారని విమర్శించారు.
ఏలేటి ప్రజెంటేషన్‌లోని ప్రధాన ఆరోపణలు
ఐడీఎల్ భూములు: ఉదాసీన్ మఠానికి చెందిన 537, అసైన్డ్ 152, డీ-నోటిఫైడ్ అటవీ భూములు 181 ఎకరాలు.. మొత్తం 871 ఎకరాలను 1961–65 మధ్య ఐడీఎల్‌కు కేటాయించారు. కంపెనీ మూతపడ్డాక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని ఏలేటి ఆరోపించారు. 2009లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ పేరిట 100 ఎకరాలు డీ-నోటిఫై చేశారని, 2020లో ఎకరానికి రూ.వెయ్యి చొప్పున సేల్ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు. అందులో 42 ఎకరాలు ఫీనిక్స్, హానర్ వంటి సంస్థలకు వెళ్లి మల్టీపర్పస్ జోన్‌గా మారాయని, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మఠం భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.
- ఐడీపీఎల్ భూములు: నైపర్ కంపెనీకి ఇచ్చేందుకు వెనక్కి తీసుకునే ప్రక్రియలో ఉండగానే, కోర్టు కేసుల మధ్య 60–70 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. బాలానగర్ పరిధి మూసాపేట్ సర్వే నంబర్ 210లోని 18 ఎకరాల 30 గుంటల కేంద్ర ప్రభుత్వ భూమిని తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
- భూముల ఆక్రమణ: నార్సింగిలో 2.34 ఎకరాల నది గర్భంతో కలిపి మొత్తం 3 ఎకరాల 3 గుంటల రివర్ బెడ్, బఫర్ జోన్ భూమిని శ్రీ ఆదిత్య రియల్టర్స్ ఆక్రమించిందని ఆరోపించారు. ఎన్ఆర్ఎస్సీ, హెచ్ఎండీఏ ఆధారాలతో హైడ్రా గుర్తించి నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు.
- శేరిలింగంపల్లి భూమి: సర్వే నంబర్ 117/3/1లోని 27 ఎకరాల 18 గుంటలు 1954–58 ఖాస్రా పహాణీ ప్రకారం ప్రభుత్వ భూమి అని తెలిపారు. 1995లో డీఆర్వో ప్రొసీడింగ్స్‌తో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన ఈ భూమిపై గతంలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టులో పోరాడారని, ఇప్పుడు అదే భూమిలో నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
- నార్సింగి భూమి: సర్వే నంబర్ 20లో పార్కింగ్, మెటీరియల్ నిల్వకు ఎకరం 17 గుంటలు లీజుకు అడిగి, 3 ఎకరాల 17 గుంటలు ఆక్రమించారని ఏలేటి ఆరోపించారు. కలెక్టర్ లెటర్ సాకుతో సర్వే నంబర్‌ను 22ఏ నుంచి తొలగించారని, కోర్టు వివాదాల మధ్య 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు.
- పుప్పాలగూడ భూములు: సర్వే నంబర్లు 285, 286, 287లోని భూమిని గతంలో ఇవాక్యూ ప్రాపర్టీగా పేర్కొని రిజిస్ట్రేషన్ నిరాకరించారని తెలిపారు. రెవెన్యూ మంత్రి కుటుంబానికి చెందిన ‘నోవా బై రాఘవ’ (రాఘవ కన్స్ట్రక్షన్స్/బ్లూస్టోన్ ఫీనిక్స్) రంగంలోకి వచ్చాక ల్యాండ్ కన్వర్షన్, హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్లు వచ్చాయని ఆరోపించారు.
- నానక్‌రాంగూడ భూములు: టీజీఐఐసీ సేకరించిన 14.79 ఎకరాల్లో ఫీనిక్స్ ఐటీ సెజ్ అనుమతి పొందిందని, అందులో 7.83 ఎకరాలను డీ-నోటిఫై చేయించి ఐదు టవర్లతో 62 అంతస్తుల భవనాలకు ఫిబ్రవరి 18న అనుమతి తీసుకున్నారని చెప్పారు. మరుసటి రోజే ఆ భూమిని మంత్రి కుటుంబానికి చెందిన రాఘవ హైరైజ్ జోన్‌కు జీడీపీఏ ద్వారా బదిలీ చేశారని ఆరోపించారు.
23 లక్షల ఎకరాల భూ బదిలీలపై విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రూ.23 లక్షల కోట్ల విలువైన 23 లక్షల ఎకరాల ప్రభుత్వ, నిషేధిత భూములు అన్యాక్రాంత మయ్యాయని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ధరణి ద్వారా 13 వేల అనుమానాస్పద ఖాతాలకు 23 లక్షల ఎకరాలు అక్రమంగా బదిలీ అయినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ తేల్చినా కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. భూభారతిలో 25,518 ఎకరాలను ఏ ప్రాతిపదికన 22ఏ జాబితా నుంచి తొలగించారో చెప్పాలన్నారు. 23.79 లక్షల ఎకరాల అటవీ భూములతోపాటు వేల ఎకరాల దేవాదాయ, భూదాన్ భూముల లెక్కలు గల్లంతయ్యాయని విమర్శించారు. ధరణి, భూభారతి ద్వారా జరిగిన భూ బదిలీలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
