ఏజెన్సీ ప్రాంతాల్లో.. కుటుంబానికి 125 రోజుల ఉపాధి: మంత్రి సీతక్క

ఏజెన్సీ ప్రాంతాల్లో.. కుటుంబానికి 125 రోజుల ఉపాధి: మంత్రి సీతక్క
  • నెలకు రూ.7,500 వేతనం అందేలా చర్యలు
  • ఆఫీసర్లు పల్లెల్లో పర్యటించాలన్న మంత్రి సీతక్క 
  • ఎల్‌‌‌‌‌‌‌‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తలెత్తే తీవ్ర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణతో సన్నద్ధం కావాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత, పశుగ్రాసం సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వీబీ–జీ రామ్‌‌‌‌‌‌‌‌ జీ ఆధ్వర్యంలో ఎల్‌‌‌‌‌‌‌‌నినో కరువు నివారణ చర్యలపై హైదరాబాద్​లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆమె మాట్లాడారు. 

రాష్ట్రంలో 18 జిల్లాల పరిధిలోని 320 మండలాల్లో సాధారణం కంటే 20 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. సాధారణంగా వేసవి ప్రభావం 3 నెలలే ఉంటుందని, ఎల్‌‌‌‌‌‌‌‌నినో కారణంగా దాదాపు 8 నెలల పాటు వేసవి తరహా వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రెండో పంట సాగు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నందున, గిరిజనులకు ఉపాధి హామీ పథకమే ప్రధాన జీవనాధారమని పేర్కొన్నారు. అర్హులందరికీ జాబ్‌‌‌‌‌‌‌‌కార్డులు మంజూరు చేసి, రాబోయే 5 నెలల్లో ప్రతి జాబ్‌‌‌‌‌‌‌‌కార్డుకు నెలకు కనీసం రూ.7,500 వేతనం లభించేలా చూడాలన్నారు.

పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందాలి

ఉపాధి హామీ కింద కేవలం కూలీ కల్పించడమే కాకుండా గ్రామాల అభివృద్ధికి తోడ్పడే శాశ్వత ఆస్తులను సృష్టించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పథకంలోని 370 రకాల పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మట్టి రోడ్లు, ఊట చెరువులు, పెర్కొలేషన్ ట్యాంకులు, చెరువుల్లో పూడికతీత, కందకాల తవ్వకం పనులను విస్తృతంగా చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చన్నారు. 

అటవీ ప్రాంతాల్లో చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం ద్వారా పశుసంపదకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా చూడాలన్నారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా నిరంతరం గ్రామాల్లో పర్యటించినప్పుడే ప్రజల వాస్తవ సమస్యలు తెలుస్తాయన్న మంత్రి.. మారుమూల గ్రామాలు కూడా పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందాలన్నారు.