
కాశ్మీర్ సమస్యపై దీటుగా పోరాడిన వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ: రాంచందర్ రావు
బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖర్జీ జయంతి వేడుకలు
హైదరాబాద్, వెలుగు: ‘ఒకే దేశం – ఒకే చట్టం – ఒకే రేషన్ – ఒకే ఎన్నికలు’ అనే భావనను ముందుంచి, దేశ సమగ్రత కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి రాంచందర్ రావు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్న వయసులోనే అనేక పోరాటాలు చేసి, జన సంఘ్‌ను స్థాపించి, కాశ్మీర్ సమస్యపై దీటుగా పోరాడిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని కొనియాడారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ బాటలో ముందుకెళ్తూ, దేశ ఐక్యత, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని గుర్తుచేశారు. దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని పోరాడిన నేతగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ట్రెజరర్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.