
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్
- నీల్వాయిలో మధుకర్ కుటుంబానికి పరామర్శ
- రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన నీల్వాయి గ్రామానికి వెళ్లి మధుకర్ కుటుంబాన్ని పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కొట్లాడుతూ, అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలపై పోరాడుతూ మధుకర్ మండలంలో మంచి పేరు సంపాదించుకున్నాడన్నారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో వేమనపల్లి జడ్పీటీసీగా పోటీకి సిద్ధమయ్యాడని, ఆయన బరిలో ఉంటే కాంగ్రెస్ గెలుపు కష్టమని భావించి అక్రమ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ లీడర్లకు కొంత మంది పోలీసు అధికారులు వత్తాసు పలుకుతూ మధుకర్ ఆత్మహత్యకు కారణమయ్యారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు ఇచ్చిన 48 గంటల గడువు పూర్తయిందని, వెంటనే 13 మంది నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మధుకర్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సీపీ అంబర్ కిశోర్ ఝాను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ , మాజీ ఎంపీ బి.వెంకటేశ్, నాయకులు గోమాస శ్రీనివాస్, కొయ్యల ఏమాజీ, దుర్గం అశోక్ ఉన్నారు.