
హైదరాబాద్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలనే లక్ష్యంగా.. బీజేపీ హైకమాండ్ ఆమోదంతో స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కమిటీలు ఏర్పాటు చేశారు. సభ్యులుగా నియమితులైన వారికి మాత్రమే ఆయన ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు అటెండ్ కావాలని ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. కమిటీల విషయాన్ని మాత్రం కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించలేదు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగమైన ఈ కమిటీల నియామక విషయం.. బయటకు తెలియాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో ఆయన అన్నట్లు తెలిసింది.
పార్టీ వర్గాలు ఇచ్చిన వివరాల ప్రకారం.. స్టేట్ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా కిషన్ రెడ్డి, సభ్యులుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహ కార్యదర్శి అరవింద్ మీనన్‌తో పాటు మరి కొందరు నియమితులయ్యారు. రెండేండ్ల కింద ఏర్పాటు చేసిన చేరికల కమిటీకి మొదటి చైర్మన్‌గా ప్రస్తుత త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, ఆ తర్వాత ఈటల రాజేందర్ వ్యవహరించారు. ఇప్పడు ముగ్గురు కీలక నేతలతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సభ్యులుగా ఉన్నారు.
శ్రీరామ మందిర్ దర్శన్ అభియాన్ కమిటీ కో ఆర్డినేటర్‌గా వెంకట రమణా రెడ్డి
శ్రీరామ మందిర్ దర్శన్ అభియాన్ కమిటీ కో ఆర్డినేటర్‌గా కామారెడ్డి ఎమ్మెల్యే కాటెపల్లి వెంకట రమణారెడ్డి, ఇన్చార్జ్గా ప్రేమేందర్ రెడ్డిని నియమించారు. కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల కమిటీకి రాష్ట్ర కార్యదర్శిగా ప్రకాశ్ రెడ్డిని, గావ్.. గావ్.. జానా (ప్రతి ఊరికి పోవాలి) కమిటీకి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, వికసిత్ భారత్ కమిటీకి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లును నియమించారు. కొత్త ఓటర్లతో సమ్మేళనం అనే కమిటీకి కూడా కాసం వెంకటేశ్వర్లునే నియమించారు. కాగా, ఈ నెల 14 నుంచి 22 దాకా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని కిషన్ రెడ్డి పార్టీ కేడర్, హిందూ సంస్థలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అవినీతిపై ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు : మురళీధర్ రావు
కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని బీజేపీ మధ్యప్రదేశ్ స్టేట్ ఇన్చార్జ్ మురళీధర్ రావు విమర్శించారు. శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం, విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను నిలదీసిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన రేవంత్.. ఇప్పుడు ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించడం లేదని ఆయన నిలదీశారు.