పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్ కనుమరుగు: లక్ష్మణ్ 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్ కనుమరుగు: లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నట్టు నటిస్తున్నాయని ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్‌‌‌‌ ఆఫీసులో పార్టీ నేతలు రాణిరుద్రమ, ఆలె భాస్కర్‌‌‌‌‌‌‌‌తో కలిసి లక్ష్మణ్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి రాముడి కల్యాణానికి లైవ్ టెలికాస్ట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి సర్కారు రాజకీయంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు.

చివరికి ఈసీ అనుమతిచ్చిందని, ఇది రామ భక్తుల విజయమన్నారు. దేశంలో ఏ సర్వే చూసినా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నాయని, దాదాపు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని చెబుతున్నాయన్నారు. దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ ప్రకటించారని, అలాంటిది రాహుల్ ప్రధాని అవుతారని తెలంగాణ నేతలు కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే అవసరం, అవకాశం బీజేపీకి లేదన్నారు. తమ నినాదం వికసిత్ భారత్ అని, కాంగ్రెస్ నినాదం విభజిత్ భారత్ అంటూ ఎద్దేవా చేశారు.