Actor Sreenivasan: లెజెండరీ యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాసన్ మృతి.. ఏమైందంటే?

Actor Sreenivasan: లెజెండరీ యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాసన్ మృతి.. ఏమైందంటే?

ప్రముఖ మలయాళ నటుడు, దర్శక నిర్మాత, రచయిత శ్రీనివాసన్ (69) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. శనివారం (2025 డిసెంబర్ 20న) ఉదయం 8.22 గంటలకు రచయిత శ్రీనివాసన్ తుదిశ్వాస విడిచినట్లు మలయాళ సినీవర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో శ్రీనివాసన్ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు నివాళులర్పిస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభావంతులలో శ్రీనివాసన్‌ ఒకరని గుర్తుచేసుకున్నారు.

ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మలయాళ సినిమాకు చెందిన గొప్ప నటుడు, రచయిత శ్రీనివాసన్ గారి మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ఎమోషనల్ ట్వీట్ చేసింది. 

దర్శక నిర్మాత, రచయిత శ్రీనివాసన్ ప్రస్థానం:

1956లో కేరళలోని కన్నూరు జిల్లాలోని పట్టియంలో జన్మించారు శ్రీనివాసన్. దాదాపు 5 దశాబ్దాల కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు. సామాజిక సినిమాలతో ఎంతోమందిని కదిలించే చిత్రాలు సైతం డైరెక్ట్ చేసి ఆలోచింపజేశారు. నటనతో పాటు, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేసి గుర్తింపు పొందారు.

శ్రీనివాసన్ దాదాపు 225కి పైగా చిత్రాలలో నటించారు. 1976 లో మణిముళక్కం అనే చిత్రంలో తొలిసారిగా నటించారు. 1989లో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా ‘వడక్కునొక్కియంత్రం’ ఉత్తమ చలనచిత్రంగా కేరళ రాష్ట్ర అవార్డును సొంతం చేసుకుంది. ‘చింతశిష్త్య శ్యామల’ అనే మరో సామజిక చిత్రం జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఈ సినిమాలో నటించడమే కాకుండా డైరెక్ట్ చేసి ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకున్నారు. ఇలా శ్రీనివాసన్ తన ప్రతిభతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

శ్రీనివాసన్‌ ఇద్దరు కుమారులు సైతం సినిమాల్లో రాణిస్తున్నారు. అందులో ఒకరే వినీత్ శ్రీనివాసన్. ఇతను నటుడు, దర్శకుడు, నిర్మాత, సింగర్ మరియు స్క్రీన్ రైటర్ గా రాణిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలలో పనిచేస్తారు. మరో కుమారుడు ధ్యాన్ శ్రీనివాసన్. ఇతను కూడా సినిమాల్లోనే నటిస్తున్నారు.