నసరుల్లాబాద్ ఎన్నికల్లో మద్దతివ్వలేదని..కాంగ్రెస్ లీడర్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి

నసరుల్లాబాద్ ఎన్నికల్లో మద్దతివ్వలేదని..కాంగ్రెస్ లీడర్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి

జడ్చర్ల/జడ్చర్ల టౌన్, వెలుగు:  పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వలేదన్న కోపంతో కాంగ్రెస్​ లీడర్​పై బీఆర్ఎస్​ నాయకులు దాడికి పాల్పడ్డారు. నసరుల్లాబాద్​ తండాలో ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్​ మద్దతుతో పాత్లావత్​ రాజేశ్, కాంగ్రెస్​ మద్దతుతో విస్లావత్​ రంజిత్​కుమార్​ పోటీ చేశారు. అదే తండాకు చెందిన పెంట్యానాయక్​ రంజిత్​ కుమార్​కు మద్దతుగా ప్రచారం చేసి, గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. 

దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్​ మద్దతుదారులైన రాత్లావత్​ సుమన్, విస్లావత్  సంతోష్​ నాయక్, సబావత్​ అరవింద్​ ఇంటి ముందు కూర్చొని ఉన్న  పెంట్యానాయక్​పై గురువారం రాత్రి గొడ్డలితో దాడి చేశారు. పెంట్యా నాయక్​కు తీవ్రగాయాలు కాగా, అతడిని మహబూబ్​నగర్​ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య కేతావత్​ అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల టౌన్​ సీఐ కమలాకర్​ తెలిపారు.

దాడులు చేయడమే బీఆర్ఎస్  సంస్కృతి

దాడులు చేయడమే బీఆర్ఎస్​ సంస్కృతి అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి విమర్శించారు. మహబూబ్​నగర్​లోని ఎస్వీఎస్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెంట్యానాయక్​ను ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్  నాయకుల దాడిని ఎమ్మెల్యే ఖండించారు. 

ఎవరు రౌడీయిజం చేస్తున్నారో కేటీఆర్  సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్  నాయకులు రౌడీయిజం చేస్తున్నారని కేటీఆర్ అంటున్నాడని చెప్పారు. పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కాంగ్రెస్  కార్యకర్తలు ఎలాంటి ప్రతీకార దాడులకు పాల్పడవద్దని సూచించారు.