ఎనిమిది ఏనుగులను తొక్కించుకుంటూ వెళ్లిన రాజధాని ఎక్స్ ప్రెస్ : పట్టాలు తప్పిన 5 బోగీలు

ఎనిమిది ఏనుగులను తొక్కించుకుంటూ వెళ్లిన రాజధాని ఎక్స్ ప్రెస్ : పట్టాలు తప్పిన 5 బోగీలు

అసోంలో  ఏనుగుల గుంపును రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  8ఏనుగులు మృతిచెందాయి. రాజధాని ఎక్స్ ప్రెస్ కు చెందిన  5 బోగీలు పట్టాలు తప్పాయి.  శనివారం ( డిసెంబర్ 20) తెల్లవారు జామున 2గంటల కు అస్సాంలోని హోజై జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు బోగీలు పట్టాల తప్పడంతో ఆ రూట్లో వెళ్లే మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మిజోరాంలోని సైరాంగ్‌నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌కు ఈ రైలు ప్రయాణిస్తోంది. ఏనుగుల గుంపును ఢీకొట్టి ఐదు రైలు కోచ్‌లు, ఇంజిన్ పట్టాలు తప్పాయి. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసినప్పటికీ  ఫలితంగా లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులెవరూ గాయపడలేదు. అసోం రాజధాని గౌహతికి 126 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ అధికారులుతెలిపారు. 

ఈ ప్రమాదంతో అసోంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన జమునా ముఖ్ కాంపూర్ సెక్షన్ గుండా వెళ్లాల్సిన రైళ్లను యూపీ లైన్ ద్వారా మళ్లించారు.  ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ లపై ప్రమాదానికి గురై అడవి జంతువులు చనిపోతుండటంతో ఆందోళనలు తలెత్తుతున్నాయి. 

అటవీ ప్రాంతంలో ట్రాక్ లపై అటవి జంతువుల ఉనికిని గుర్తించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. 2025 మార్చి నుంచి ట్రాక్ లపై ఏనుగులను గుర్తించేందుకు AI ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ను డెవలప్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.