అడవుల్లో నాటు బాంబులు: మృత్యువాత పడుతున్న మూగజీవాలు

అడవుల్లో నాటు బాంబులు: మృత్యువాత పడుతున్న మూగజీవాలు

ఉమ్మడి వరంగల్​లో వరుస ఘటనలు..  ఆందోళనలో ప్రజలు
మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అడవుల్లో నాటు బాంబుల పేలుళ్లు పెరిగిపోతున్నాయి. వరుస ఘటనల్లో మూగజీవాలు చనిపోతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల19న మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వినోభానగర్ అటవీ ప్రాంతంలోకి గొర్ల కాపరి అశోక్ గొర్రెలు, పెంపుడు కుక్కను తోలుకెళ్లాడు. మేత మేస్తుండగా కుక్క గడ్డిలో పడి ఉన్న నాటు బాంబును కొరికింది. పెద్ద సౌండ్​రావడంతోపాటు తీవ్రగాయాలై కుక్క అక్కడికక్కడే చనిపోయింది. అలాగే 20వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధిలోని తిరుమలగిరి శివారు పాండవుల గుట్ట సమీపంలో మేత మేస్తున్న గేదె నాటుబాంబు కొరికి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతుంది. ఇలా ఘటనలు జరుగుతుండడంతో అడవులకు సమీపంలోని గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. ఈ ఏరియాల్లో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఎరగా నాటు బాంబులు పెడుతున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపరచి పట్టుకునేందుకు స్కెచ్​వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 
ఎక్కడి నుంచి వస్తున్నయ్​
నిషేధిత పేలుడు పదార్థాలతో తయారు చేసిన నాటు బాంబులు అటవీ ప్రాంతాల్లో ఉండే వేటగాళ్లకు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మిస్టరీగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు తవుడు, గాజు పెంకులు, ఇనుప ముక్కలతో నాటు బాంబులు తయారు చేసుకొచ్చి ఇక్కడివాళ్లకు అమ్ముతున్నట్లు సమాచారం. వాటిని అడవి పందులు, జింకలు, ఇతర జంతువులు ఎక్కువగా తిరిగే చోట పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మాత్రం తమకు తోచిన చోట పెడుతుండడంతో అటుగా మేత కోసం వెళ్లిన గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, కుక్కలు కొరికి మృత్యువాత పడుతున్నాయి. 
ఆఫీసర్ల అండతోనేనా?
కొన్నిచోట్ల ఫారెస్ట్​ఆఫీసర్ల అండతోనే వన్య ప్రాణుల వేట కొనసాగుతుందనే ఆరోపణలు వినిస్తున్నాయి. వేటగాళ్లు జంతుల కోసం వలలు, ఉచ్చులు పెట్టిన టైంలో ఆఫీసర్లు వారిని బెదిరించి పైసలు గుంజుతున్నారు. అలా మామూళ్లకు అలవాటుపడి వేటగాళ్లకు చాన్స్​ఇస్తున్నారు. దీంతో వారిలో పెద్దగా భయం లేకుండా పోతోంది. వేటలో భాగంగా నాటుబాంబులు పెడుతూ వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. జింకలు, అడవి పందులను చంపి గుట్టుగా గ్రామాల్లో వాటి మాంసం అమ్మేస్తున్నారు. మహబూబాబాద్​జిల్లాలోని నెల్లికుదురు, గూడురు మండలాల పరిధిలో ఇప్పటికే చాలాసార్లు కేసులు ఫైల్ ​అయ్యాయి.