మాస్కు ధరించకుండా.. బ్రెజిల్ అధ్యక్షుడి బైకు ర్యాలీ

మాస్కు ధరించకుండా.. బ్రెజిల్ అధ్యక్షుడి బైకు ర్యాలీ
  • అదే బాటలో ర్యాలీలో అద్యక్షుడి వెంట నడిచిన కార్యకర్తలు
  • 100 డాలర్ల జరిమానా విధించిన సావో పాలో గవర్నర్
  • కరోనా నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ తీయడంపై ఆగ్రహం

బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో. వందలాది మందితో బైకు ర్యాలీ తీశాడు. జనాని చూసిన ఊపులో ఉన్నాడో ఏమో తెలియదు కానీ.. మాస్కు పెట్టుకోకుండా అభివాదం చేస్తూ హాజరైన వారిని ప్రోత్సహించాడు. ‘‘యాక్సిలరేట్ ఫర్ క్రెస్ట్’’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఓపెన్ ఫేస్ హెల్మెట్ పెట్టుకుని ప్రజలు, అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయాడు బోల్సోనారో. 
కరోనా నిబంధనలకు విరుద్ధంగా వేలాది మందితో బైకు ర్యాలీ తీయడంపై సావో పాలో గవర్నర్ జొవావో డోరియా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయానా దేశాధ్యక్షుడే మాస్కు లేకుండా ర్యాలీలో పాల్గొంటుండడంతో బైకు ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానుల్లో చాలా మంది తమ అధ్యక్షుడి బాటలోనే మాస్కులు పెట్టుకోకుండా పాల్గొన్నారు. ఇది కాస్త దేశంలో దుమారం రేపింది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు కయ్ మని లేచాయి. ర్యాలీ తీస్తామని ప్రకటించినప్పుడే కరోనా నిబంధనలు పాటించాలని గుర్తు చేశామని.. అయినా ఆయన లెక్క చేయకుండా మాస్కు పెట్టుకోకుండానే ర్యాలీ తీశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా నిబంధనలను పలుమార్లు ఉల్లంఘించిన బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం నిర్వహించిన ర్యాలీలో కూడా మాస్కు పెట్టుకోలేదు. ఈ నేపధ్యంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనకు వంద డాలర్ల జరిమానా విధించారు.