ఉపరాష్ట్రపతి ఎన్నికలో.. బీఆర్ఎస్ దారెటు?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో.. బీఆర్ఎస్ దారెటు?
  • ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎవరికి సపోర్ట్ చేస్తుందన్నదానిపై చర్చ
  • రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అంతర్గతంగా మద్దతు ఇచ్చిందన్న వాదన

హైదరాబాద్, వెలుగు: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార, ప్రతిపక్ష అభ్యర్థులెవరో తేలిపోయింది. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్​ పేరు ఇప్పటికే ఖరారైంది. ఆయనకు పోటీగా ఇండియా కూటమి.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, తెలంగాణ వాసి అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును తాజాగా ప్రకటించింది. అయితే, జస్టిస్ సుదర్శన్​రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి అని.. ఆయనకు పార్టీలకు అతీతంగా మద్దతు పలకాలని సీఎం రేవంత్​రెడ్డి సైతం విజ్ఞప్తి చేయడంతో బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఇప్పటివరకు ఆ పార్టీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ కు ఆ పార్టీ దూరంగా ఉంటుందా? లేదంటే ఇరు పక్షాల అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తుందా? అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఎన్నికకు దూరంగా ఉంటేనే మంచిదని పార్టీ పెద్దల ఆలోచనగా ఉన్నట్టు కొందరు నేతలు చెబుతున్నారు. వాస్తవానికి 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్​గా మద్దతిచ్చిందన్న వాదన ఉన్నది. దీంతో ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని ఓవర్గం అంచనా వేస్తోంది. 

బీజేపీలో బీఆర్ఎస్​ను విలీనం చేసేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేశారంటూ ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీలో గులాబీ పార్టీ విలీనానికి తీవ్రస్థాయిలోనే  కసరత్తులు జరిగాయని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఆ ఎజెండాలో భాగంగానే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు సపోర్ట్ చేసి ఓటింగ్ చేశారన్న చర్చ జరుగుతోంది. ఆ ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 
 

బీఆర్ఎస్ బలం 4 సీట్లే..  

బీఆర్ఎస్​కు ప్రస్తుతం పార్లమెంట్​లో నలుగురు సభ్యులే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక మాదిరిగా కాకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేవలం ఎంపీల ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన లోక్​సభలో 543, రాజ్యసభలో 233, నామినేటెడ్ సభ్యులు 12 కలిపితే పార్లమెంట్​లో మొత్తం ఎంపీల సంఖ్య 788గా ఉన్నది. అందులో ఎన్డీఏ కూటమికి లోక్​సభలో 293, రాజ్యసభలో 130 కలిపి సంఖ్యా బలం 423గా ఉన్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్​కు లోక్​సభలో 235, రాజ్యసభలో 78 కలిపి 313గా ఉన్నది. 

ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకు మెజార్టీ మార్క్ 394 కంటే అధికంగానే ఓట్లు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ గత లోక్​సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేదు. ఆ పార్టీకి రాజ్యసభలో మాత్రం నలుగురు ఎంపీలు(వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు) ఉన్నారు. దీంతో ఆ పార్టీ సంఖ్యా బలం 4గా ఉన్నది. ఒకవేళ బీఆర్ఎస్ ఓటింగ్​లో పాల్గొంటే ఆ నలుగురు ఎవరికి ఓటేస్తారన్నది చర్చనీయాంశమైంది.