గుంటూరులో బీటెక్ స్టూడెంట్ ను పొడిచి చంపిన యువకుడి అరెస్ట్

 గుంటూరులో బీటెక్ స్టూడెంట్ ను పొడిచి చంపిన యువకుడి అరెస్ట్
  • గంటల వ్యవధిలో నిందితుడ్ని పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులు
  • ఉదయం 10 గంటల సమయంలో అందరూ చూస్తుండగా దాడి
  • నాలుగు అడుగుల దూరంలోనే అందరూ ఉన్నా.. ఏ ఒక్కరూ ఆపని వైనం.. కనీసం ఆపే ప్రయత్నం చేయని విడ్డూరం
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన దిగ్భ్రాంతికర ఘటన
  • అందరూ చోద్యం చూస్తుండడంతో రెచ్చిపోయి అమ్మాయి కిందపడిపోయినా వదలకుండా కత్తిపోట్లు పొడిచిన నిందితుడు
  • కత్తితో దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిందిపోయి.. అరె ఏంది.. ఆపు.. అంటూ మాటలతో వారించిన పలువురు
  • మాటలతో వారించిన వాళ్లే రెండడుగులు ముందుకేసి అడ్డుకుంటే ఘోరం ఆగేదే
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన మర్డర్ దృశ్యాలతో గంటల వ్యవధిలో నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

గుంటూరు: బీటెక్ స్టూడెంట్ ను పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి చంపిన యువకుడి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశమంతా స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న సమయంలో గుంటూరులో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘోర హత్య గురించి రాష్ట్రమంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. కేసును సవాల్ గా తీసుకుని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. 
రమ్య హత్య ఘటన దురదృష్టకరం: డీజీపీ గౌతమ్ సవాంగ్
గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్చేశామని.. ఈ రోజు జరిగిన రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించడం జరిగిందని, ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని, హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని, నిందుతుణ్ణి కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: 
ఘటనపై స్పందిస్తూ డీజీసీ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు చేశారు. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతులు, మహిళల పై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవని, జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని మనవి చేసుకున్నారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలనికోరారు. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
గుంటూరు నగరంలో కలకలం రేపిన బిటెక్ విద్యార్దిని రమ్య హత్య
గుంటూరు పట్టణంలో ఉదయం పది గంటల సమయంలో పట్టపగలు అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద బీటెక్ విద్యార్దిని రమ్యపై  ఓ యువకుడు కత్తి తో పొడిచి పరైరాన ఘటన కల కలం రేపింది. కాకాని రోడ్డులోని పరామయకుంటలో జరిగిన ఘటన దావానలంలా వ్యాపించడంతో విషాదం రేపింది. సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ 
3వ సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య ను వెంటపడుతూ వచ్చిన యువకుడు అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. అతడితో మాట్లాడేందుకు ఇష్టపడకపోతే.. దగ్గరకొచ్చి చేయి పట్టుకుని గట్టిగా నిలదీశాడు. రమ్య ఇచ్చిన సమాధానంతో కోపోద్రికుడైన యువకుడు.. జేబులో నుంచి కత్తి తీశాడు. ఒక్కసారిగా దాడికి ప్రయత్నించగా రమ్య తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే యువకుడు దగ్గరకొచ్చిచేయి పట్టుకుని పొట్టలో రెండు కత్తిపోట్లు దించాడు. దీంతో యువతి రోడ్డుపై పడిపోయింది. ఇదంతా ఎదురుగా హోటల్ వద్ద టీ తాగుతున్న వారు.. వారికి రెండడుగుల దూరంలో ఆటో దిగిన వారు చూస్తూనే ఉన్నారు. ఓ వ్యక్తి  చేతిలో టీ కప్పుతో తాగుతూ ఏమిటిది.. రేయ్.. ఆగు అంటూవారించే మాటలుచెప్పడమే తప్ప అడుగు తీసి వారివైపు వెళ్లకపోవడంతో యువకుడు అడ్వాంటేజీగా తీసుకున్నాడు. కత్తిపోట్లకు గురై రోడ్డుపై పడిపోయిన రమ్య పై మీదపడి కత్తితో పదేపదే పొడిచేస్తుంటే..కేవలం నాలుగడుగుల దూరంలో నిలబడిన ముగ్గురు వ్యక్తులు మాటలతో వారించే ప్రయత్నం చేశారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. రమ్యను కసితీరా పొడిచేసిన యువకుడు రోడ్డుదాటి పారిపోవడంతో అందరూ చోద్యం చూసి అంబులెన్స్ కు ఫోన్ చేయడం కనిపించింది. 
జిజిహెచ్ లో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించిన  వాసిరెడ్డి పద్మ, అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్
కత్తిపోట్లతో దారుణ హత్య కు గురైన రమ్య మృత దేహాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ పరిశీలించారు. గుంటూరు నగరం లో పట్టపగలు స్వాత్రంత్ర దినోత్సవం రోజున ఈ  దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరం, చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ అన్నారు. ఘటన గురించి జిల్లా ఎస్పీ తో మాట్లాడారామె. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చూడాలని, దీని కోసం తమ వంతు సహకారం ఇస్తామని పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ. మెడ పైన, పొత్తి కడుపులో ఆరు చోట్ల కత్తితో తీవ్రంగా గాయపరచడం వల్ల రమ్య వెంటనే చనిపోయిందని, బాగా పరిచయస్థుడే ఈ   ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. నిండుతుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. 
రూ.10 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం జగన్
బీటెక్ విద్యార్థిన ఘటనపై సీఎం జగన్ స్పందించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల సహాయం అందించాలని ఆదేశించారు. ఘటన చాలా దురదృష్టకరమని, దిశ చట్టం ప్రకారం నిందితుడిపై వేగంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష పడేలా చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. 
నరసరావుపేటలో పట్టుపడిన నిందితుడు
గుంటూరు లో బీటెక్ విద్యార్థినిని పొడిచి చంపిన యువకుడు నరసరావుపేటలో పట్టుపడ్డాడు. ఘటన సంచలనం సృస్టించడంతో స్థానికుల సమాచారంతోపాటు.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పరిచయం ఉన్న యువకుడేనని గుర్తించారు. అతడి ఫోటోలను అన్ని పోలీసు స్టేషన్లకు పంపగా నరసరావుపేటలో బస్సు దిగినట్లు గుర్తించారు. వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లగా బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అప్రమత్తమై వెంటనే పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుండి వైద్యులు, పోలీసు అధికారుల సూచన మేరకు గట్టి బందోబస్తు.. మధ్య గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.