
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : రెండు దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన లెజెండరీ ప్లేయర్లు రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్, నొవాక్ జొకోవిచ్. ఈ ముగ్గురు కలిపి 66 గ్రాండ్‌స్లామ్స్ సొంతం చేసుకున్నారు. ఆటపై చెరగని ముద్ర వేస్తూ ఫెడెక్స్, రఫా ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా.. జకోవిచ్ కెరీర్ చివరి అంకంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో ఓడిన తర్వాత రోలాండ్ గారోస్‌లో తనకదే చివరి మ్యాచ్ కావొచ్చని 38 ఏండ్ల నొవాక్ చెప్పాడు. ఏజ్ దృష్ట్యా తను ఒకటి రెండేండ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు. దాంతో మెన్స్ సింగిల్స్ టెన్నిస్‌లో గోల్డెన్ ఎరా చివరి దశకు చేరిన వేళ వారి ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? అనే ప్రశ్నకు టెన్నిస్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సమాధానం దొరికింది.
క్లే కోర్టులో14 గ్రాండ్ స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన నడాల్ పుట్టిన స్పెయిన్ గడ్డ నుంచి ఒక యువ కెరటం దూసుకొచ్చింది. స్పెయిన్ బుల్ మాదిరిగా కొత్త కుర్రాడు వస్తూనే చరిత్ర సృష్టించాడు. 19 ఏండ్లకే వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ అందుకొని ఇంకో మూడేండ్లు తిరిగే సరికి ఐదు గ్రాండ్‌స్లామ్స్ ఖాతాలో వేసుకొని మెన్స్ టెన్నిస్‌లో కొత్త రారాజుగా నిలిచాడు. అతనే కార్లోస్ అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అసాధారణ పోరాటపటిమ చూపెట్టిన 22 ఏండ్ల కార్లోస్ స్పెయిన్ బుల్ నడాల్ బాటలో నడుస్తూ ఈ తరం నయా బిగ్ బుల్‌గా కనిపిస్తున్నాడు.
యంగెస్ట్ వరల్డ్ నంబర్ వన్
స్పెయిన్‌లోని ఎల్ పాల్మార్ అనే చిన్న పట్టణంలో పుట్టిన అల్కరాజ్‌కు టెన్నిస్ అంటే పిచ్చి. తండ్రి కార్లోస్ అల్కరాజ్ గొంజాలెజ్ కోచ్ కావడంతో ఊహతెలిసే సమయానికే టెన్నిస్ రాకెట్ కార్లోస్ నేస్తం అయింది. నాలుగేండ్ల వయసులోనే తండ్రి మార్గదర్శకత్వంలో ఆటను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్ జువాన్ కార్లోస్ ఫెర్రెరో శిక్షణలో చేరిన తర్వాత ఆటలో రాటుదేలాడు. 2020లో ప్రొఫెషనల్‌గా మారిన కార్లోస్ అతి తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశాడు. 2022లో మయామి, మాడ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక మాస్టర్స్ టైటిళ్లను గెలుచుకొని ఔరా అనిపించాడు. అదే ఏడాది మాడ్రిడ్ ఓపెన్‌లో క్లే కోర్టుపై నడాల్, జొకోవిచ్‌ను వరుస మ్యాచ్‌లలో ఓడించి సంచలనం సృష్టించాడు.
ఆ విజయాలతో కార్లోస్‌లోని ఫ్యూచర్ చాంపియన్‌ను టెన్నిస్ వరల్డ్ గుర్తించింది. తనపై అంచనాలను నిజం చేసిన అల్కరాజ్ 2022 యూఎస్ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచి, 19 ఏండ్లకే టెన్నిస్ చరిత్రలోనే యంగెస్ట్ వరల్డ్ నంబర్ వన్ అయ్యాడు. 2023 వింబుల్డన్‌లో గ్రాస్ కోర్టుపై రారాజుగా వెలుగొందుతున్న జొకోవిచ్‌ను ఫైనల్లో ఓడించి ఈ తరం ఆటగాళ్లలో తానెంత ప్రత్యేకమో నిరూపించుకున్నాడు. 2024లో ఆ టైటిల్‌ను నిలబెట్టుకున్న కార్లోస్ తాను అక్కడితో ఆగిపోయేది లేదని చాటి చెప్పాడు. తన తర్వాతి టార్గెట్‌ను ఫ్రెంచ్ ఓపెన్‌పై పెట్టాడు. క్లే కోర్టుపై తన ఆధిపత్యాన్ని చాటుతూ గతేడాది తొలిసారి రోలాండ్ గారోస్‌లో ట్రోఫీ ముద్దాడాడు. ఇప్పుడు ఆ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.
ఒక్కడిలో ముగ్గురు దిగ్గజాల ఆట
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్ చూపిన పోరాటం అతని సత్తాకు నిదర్శనం. ఐదున్నర గంటలు సాగిన ఈ హోరాహోరీ పోరులో ప్రత్యర్థి యానిక్ సిన్నర్ చేతిలో తొలి రెండు సెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచాడు. కానీ, అక్కడి నుంచే అసలైన అల్కరాజ్ ఆట మొదలైంది. మొక్కవోని పట్టుదల, సంకల్పంతో సినర్‌కు ఎదురు నిలిచాడు. ముఖ్యంగా నాలుగో సెట్‌లో 5–3తో ఆధిక్యంలో నిలిచిన సినర్ తొమ్మిదో గేమ్‌లో 40–0తో మూడు మ్యాచ్ పాయింట్లపై నిలిచిన దశలో కార్లోస్ పుంజుకున్న తీరు నభూతో అనొచ్చు.
రోలాండ్ గారోస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ఫైనల్‌గా నిలిచిన ఈ మ్యాచ్ టెన్నిస్ హిస్టరీలో నిలిచిపోవడం ఖాయం. అల్కరాజ్ ఆటతీరులో ముగ్గురు దిగ్గజాల ఛాయలు కనిపిస్తాయి. నడాల్ పవర్‌ఫుల్ ఫోర్‌హ్యాండ్, ఫెడరర్ మార్కు సున్నితమైన డ్రాప్ షాట్లు, జొకోవిచ్ మాదిరిగా కోర్టులో పాదరసంలా కలిగే అసాధారణ వేగం, మానసిక దృఢత్వం అతని సొంతం. వీటన్నింటినీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో చూపెట్టాడు. మరీ ముఖ్యంగా తన నిర్భయమైన ఆట, ఓటమి అంచున ఉన్నా పోరాడేతత్వం ఈ తరం ఆటగాళ్లలో కార్లోస్‌ను స్పెషల్‌గా నిలబెడుతున్నాయి.
ఇక కార్లోస్ శకమేనా
టెన్నిస్‌లో బిగ్ త్రీ నెలకొల్పిన రికార్డులను అందుకోవడం అసాధ్యమనే భావన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కార్లోస్ ఆట చూసిన తర్వాత తొలగిపోయింది. కార్లోస్‌ను ఇప్పుడే దిగ్గజాల సరసన చేర్చలేం. కానీ, ఆ దిశగా అతను బలమైన అడుగులు వేస్తున్నాడు. అతని ఏజ్, టాలెంట్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తను చూపిన పోరాట పటిమ చూస్తుంటే, టెన్నిస్ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుత తరంలో అల్కరాజ్‌కు గట్టి పోటీ ఇచ్చి, మేటి ఆటగాడిగా ఎదిగే సత్తా ఉన్న మరో ఆటగాడు 23 ఏండ్ల యానిక్ సినర్. వయసు, ఆటతీరు దృష్ట్యా.. ఫెడరర్, రఫా, జకో మాదిరిగా మున్ముందు చాలా కాలం పాటు ఈ ఇద్దరూ చిరకాల ప్రత్యర్థులు కానున్నారు.
ప్రస్తుతానికి ఈ ఇద్దరి మధ్య ముఖాముఖిల్లో కార్లోస్ 8–4తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు గ్రాండ్‌స్లామ్స్‌లో 8 సార్లు తలపడితే కార్లోస్ ఐదింటిలో గెలిచాడు. ఏదేమైనా ఈ ఆటలో అల్కరాజ్‌కు ఇది ఆరంభమే. ఇదే కసి, పట్టుదలను కొనసాగిస్తే తన రాకెట్ నుంచి
మరెన్నో అద్భుతాలు చూడొచ్చు.
22 ఏండ్ల 1 నెల 3 రోజులు.. 5 గ్రాండ్‌స్లామ్స్
ఆదివారం తన ఐదో గ్రాండ్‌స్లామ్ గెలిచే నాటికి కార్లోస్ అల్కరాజ్ వయసు 22 సంవత్సరాల 1 నెల 3 రోజులు. లెజెండరీ ఆటగాడు రఫెల్ నడాల్ తన ఐదో గ్రాండ్‌స్లామ్ (2008 వింబుల్డన్) గెలుచుకున్నప్పుడు అతని వయసు కూడా సరిగ్గా 22 ఏండ్ల 1 నెల 3 రోజులు. ఒకే దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఐదు మేజర్ టైటిళ్ల మైలురాయిని సరిగ్గా ఒకే వయసులో అందుకోవడం టెన్నిస్ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ విషయం అల్కరాజ్ తన ఆరాధ్య ఆటగాడు నడాల్‌కు అసలైన వారసుడని
మరోసారి రుజువు చేసిందని అనొచ్చు.