అస్తానా: ఇండియా రెజ్లర్లు కాజల్ ధోచక్, నీలకం.. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన విమెన్స్ 76 కేజీల సెమీస్‌లో కాజల్ 10–7తో ఐపెరి మెడెట్ కిజై (కిర్గిస్తాన్)పై గెలిచింది. తొలి పీరియడ్‌లో 1–7తో వెనకబడినా.. పట్టువదలకుండా పోరాడింది. తర్వాతి రెండు పీరియడ్స్‌లో వరుసగా పాయింట్లు నెగ్గింది.
గోల్డ్ మెడల్ బౌట్‌లో కాజల్.. అనస్తాసియా అల్ఫెవా (ఉక్రెయిన్)తో తలపడుతుంది. క్వార్టర్‌ఫైనల్లో కాజల్ 9–-2తో దవానాసన్ ఎన్క్ అమర్ (మంగోలియా)పై, అంతకుముందు జరిగిన బౌట్‌లో కామిలి గ్రిస్కిని (లిథువేనియా)పై ‘విన్ బైఫాల్’తో నెగ్గింది.
విమెన్స్ 50 కేజీల సెమీస్‌లో నీలం సిరోహి 7–3తో జైనెప్ బాయనోవా (కజకిస్తాన్)ను ఓడించింది. ప్రిక్వార్టర్స్‌లో 6-0తో నటాలియా వరాకినా (బెలారస్)ను ఓడించిన నీలంకు క్వార్టర్స్‌లో వాకోవర్ విజయం లభించింది. ఆమె ప్రత్యర్థి ఎలిజవెతా స్మిర్నోవా (రష్యా) గాయంతో బౌట్ నుంచి వైదొలిగింది. 65 కేజీల్లో రజనీత.. కెటరీనా జెలెనిఖ్‌ను ఓడించి కాంస్య పతక రేసులో నిలిచింది.
