జనగామలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

జనగామలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

జనగామ, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జనగామ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం కేసు నమోదైంది. ఈ నెల 15న జనగామలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పరువుకు భంగం కలిగించేలా రేవంత్ మాట్లాడారని, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, రూమర్స్ స్ప్రెడ్ చేశారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. దీంతో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్.. జనగామ అసెంబ్లీ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ మురళీ కృష్ణకు ఫిర్యాదు చేశారు. 

పేదలకు ఎంట్రీ లేని ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాంబులతో పేల్చి వేయ్యాలని అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయ్యా, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ 150 గదులతో పదెకరాల్లో రూ.2 వేల కోట్లతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారని విద్వేష పూరితంగా మాట్లాడారన్నారు. ప్రగతి భవన్ ముందు గద్దర్ 3 గంటల పాటు వెయిట్ చేసినా కేసీఆర్ అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వలేదని, దళిత గిరిజనులకు, స్టూడెంట్లకు, నిరుద్యోగులకు లోపలికి ఎంట్రీ లేదని రేవంత్ రూమర్స్ స్ప్రెడ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఈ మేరకు రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ ఆఫీసర్​ మురళీకృష్ణ జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 171జీ, 188, 505(2), 125 ఆర్పీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.