బ్లాక్ ఫిల్మ్ లు, మల్టీ టోన్ హారన్ ల వాహనాలపై కొరఢా 8 రోజుల్లో 1050 కేసులు

బ్లాక్ ఫిల్మ్ లు, మల్టీ టోన్ హారన్ ల వాహనాలపై కొరఢా  8 రోజుల్లో 1050 కేసులు

కేంద్ర మోటార్‌ వెహికిల్‌ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నల్ల ఫిల్మ్‌లు పెట్టుకోవడం,  ఫిల్మ్, మల్టీటోన్డ్ హారన్లు, సైరన్‌లు  కలిగిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. టింటెడ్ గ్లాస్ లేదా బ్లాక్ ఫిల్మ్, సైరన్‌లు, మల్టీ టోన్ హారన్‌లు అమర్చిన వాహనాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 8 రోజుల్లో 1050 కేసులు నమోదు చేశారు.

సుప్రీం కోర్టు, సెంట్రల్ మోటర్ వెహికల్ చట్టం ప్రకారం వాహనాలను డ్రైవ్ చేసే వ్యక్తులకు రెండు వైపులా, వెనుక వైపులా నుంచి వచ్చే వాహనాలను కనిపించాలి. అయితే బ్లాక్ ఫిల్మ్ లు ఏర్పాటు చేయడం వల్ల ఇతర వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో బ్లాక్ ఫిల్మ్‌లు రోడ్డు రవాణా అథారిటీ  పూర్తిగా నిషేధించింది. అయితే  ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు రూ.1,000 చలాన్‌గా విధిస్తున్నారు. దీంతో పాటు  అద్దాల నుండి ఫిల్మ్‌ను తీసివేస్తున్నారు.

బ్లాక్ ఫిల్మ్ అద్దాల వల్ల  పక్క, వెనుక వైపు కనిపించదు. ఇది ప్రమాదాలకు దారి తీస్తుందని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కె నారాయణ్ నాయక్ తెలిపారు. కొంతమంది కార్ల యజమానులు సన్‌షేడ్‌లు, కర్టెన్‌లను కూడా ఉపయోగిస్తున్నారుని చెప్పారు. అయితే వీటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. బ్లాక్ ఫిల్మ్ అద్దాలపై ప్రజల్లో అవగాహన కొరవడిందని.. కార్‌ డెకర్‌లు, యాక్సెసరీ షాపుల యజమానులు ‘ఆర్‌టీఏ ఆమోదం’ అని కార్ల యజమానులకు చెప్పి అక్రమంగా బ్లాక్ ఫిల్మ్‌లను బిగిస్తున్నారని వెల్లడించారు. ఇది చట్టవిరుద్దమన్నారు. 

మరోవైపు సైబరాబాద్‌ పరిధిలో అనధికార సైరన్‌ల వినియోగంపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సీపీ (ట్రాఫిక్‌) కె.నారాయణ్‌నాయక్‌ కోరినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.  ఈమేరకు సైబరాబాద్ పరిధిలో అనధికార సైరన్‌లు వాడే అన్ని వాహనాలను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.