ప్రధాని మోదీ ఆస్తి రూ. 3 కోట్లు..ఎంపీల ఆస్తులపై ఏడీఆర్ రిపోర్ట్

ప్రధాని మోదీ ఆస్తి రూ. 3 కోట్లు..ఎంపీల ఆస్తులపై ఏడీఆర్ రిపోర్ట్
  • గత పదేండ్లలో 82% పెరిగిన ప్రధాని ప్రాపర్టీ వ్యాల్యూ
  • 2014లో రాహుల్ ఆస్తి రూ.9 కోట్లు.. 2024లో రూ.20 కోట్లు
  • వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల ఆస్తులపై ఏడీఆర్ రిపోర్ట్
  • పదేండ్లలో రూ.162 కోట్ల వృద్ధితో టాప్​లో సతారా ఎంపీ ప్రతాప్ సిన్హా
  • రూ. 146 కోట్లతో మూడో స్థానంలో ఏపీ వైసీపీ ఎంపీ మిథున్​ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తరప్రదేశ్​లోని వారణాసి నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3,02,06,889గా తేలింది. 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తుల విలువ రూ.1.65 కోట్లు అని ప్రకటించారు. 2019 నాటికి రూ.2.51 కోట్లకు పెరిగింది. 2014తో పోలిస్తే పదేండ్లలో మోదీ ఆస్తి రూ.1.36 కోట్లు (82 శాతం) పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ బుధవారం తన రిపోర్టులో పేర్కొన్నది. ఇక లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు దాదాపు రూ.11 కోట్లు (117 శాతం) పెరిగాయి. 

ఎంపీల జాబితాలో ఈయన 38వ స్థానంలో ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. 2014లో రాయ్​బరేలీ నుంచి ఎంపీగా బరిలోకి దిగినప్పుడు రాహుల్ తన ఆస్తులను రూ.9.40 కోట్లుగా, 2019లో వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు రూ.15.88 కోట్లుగా చూపించారు. 2024లో అమేథి నుంచి పోటీకి దిగినప్పుడు రూ.20.39 కోట్లుగా అఫిడవిట్​లో చూపించారు. దేశవ్యాప్తంగా వరుసగా 3 సార్లు ఎంపీలుగా గెలిచిన 102 మంది తమ అఫిడవిట్​లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. 

వీరి ఆస్తులు 2014లో సరాసరిగా రూ.15.78 కోట్లుగా ఉంటే... 2024 నాటికి 110 శాతం వృద్ధితో రూ.33.13 కోట్లకు పెరిగాయి. పార్టీల వారీగా చూస్తే.. జేఎంఎంకు చెందిన ఎంపీ ఆస్తుల విలువ ఏకంగా 804 శాతం, ఎంఐఎం సభ్యుడి ప్రాపర్టీ వ్యాల్యూ 488 శాతం ఎగబాకింది. బీజేపీ నుంచి ఉన్న 65 మంది ఎంపీల ఆస్తుల విలువ సరాసరిగా 108 శాతం, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీల ప్రాపర్టీ వ్యాల్యూ 135 శాతం పెరిగిందని ఏడీఆర్ తన రిపోర్టులో పేర్కొన్నది.

టాప్​3లో ఏపీ ఎంపీ మిథున్ రెడ్డి

భారీగా ఆస్తులు పెరిగిన జాబితాలో మహారాష్ట్రలోని సతారా ఎంపీ ప్రతాప్ సిన్హా మహరాజ్ టాప్​లో నిలిచారు. 2014లో ఈయన ఆస్తి రూ.60.60 కోట్లుగా, 2019 నాటికి రూ.199.68 కోట్లకు పెరిగింది. 2024 నాటి అఫిడవిట్​లో తన ఆస్తిని రూ.223.12కోట్లుగా చూపించారు.  తర్వాతి స్థానంలో గుజరాత్ లోని జామ్​నగర్ బీజేపీ ఎంపీ పూనంబెన్ హేమంత్ భాయ్ ఉన్నారు. 

2014లో ఆమె ఆస్తి రూ.17.42 కోట్లు ఉండగా, 2019లో రూ.42.73 కోట్లు, 2024 నాటికి రూ.147.70 కోట్లకు పెరిగింది. పదేండ్లలో ఈమె ఆస్తులు రూ.130 కోట్లు పెరిగాయి. ఏపీలోని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు రూ.124 కోట్లకు పెరిగి మూడో స్థానంలో నిలిచారు. 2014లో మిథున్ రెడ్డి ఆస్తి విలువ రూ.22 కోట్లు కాగా, 2019 నాటికి రూ.66 కోట్లకు చేరింది. 2024లో 550 శాతం వృద్ధితో రూ.146 కోట్లకు ఎగబాకింది. 

మరో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆస్తి 2014లో రూ.7 కోట్లు కాగా, 2019 నాటికి రూ.18కోట్లు, 2024 నాటికి ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.40కు పెరిగింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఆస్తులు పదేండ్లలో రూ.19 కోట్లు (488 శాతం) పెరిగాయి. కోటా ఎంపీ, స్పీకర్ ఓం బిర్లా ఆస్తులు రూ.8 కోట్లు, శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి ఆస్తి రూ.14.89 కోట్లు పెరిగింది. 

కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ ఆస్తి రూ.4 కోట్లు, కిరణ్ రిజిజు ప్రాపర్టీ రూ.3 కోట్లు, అనుప్రియపటేల్ ఆస్తి రూ.1.5 కోట్లు పెరిగాయి. 2014 నుంచి 2024 మధ్య జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆస్తి రూ.34 కోట్లు తగ్గింది. 2014లో ఆయన ఆస్తి విలువ రూ.74.47 కోట్లు ఉంటే.. 2024 నాటికి రూ.39.49 కోట్లకు పడిపోయింది.