వికారాబాద్‌ జిల్లా పరిగిలో డెయిరీ ఫామ్ లో బర్రెలు దొంగతనం

వికారాబాద్‌ జిల్లా పరిగిలో  డెయిరీ ఫామ్ లో బర్రెలు దొంగతనం

పరిగి, వెలుగు: డెయిరీ ఫామ్ నుంచి దుండగులు బర్రెలను ఎత్తుకెళ్లారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సయ్యద్‌ మల్కాపూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కురువ శివ మూడేళ్లుగా తన పొలం వద్ద డెయిరీ ఫాం ఏర్పాటు చేసి పాల వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల వరకు ఫాం వద్దే ఉండి ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఏడు గేదెలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు.

తాళ్లను కట్ చేసి బర్రెలను వాహనంలో ఎక్కించుకుని పారిపోయినట్లు శివ అనుమానిస్తున్నాడు. వాహనంలోకి ఎక్కించేందుకు నిరాకరించిన గేదెలను కొట్టిన గుర్తులు కూడా ఉన్నాయని తెలిపాడు. దొంగలు డీసీఎం వాహనంలో పశువులను తరలించినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు.