
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన పేరును బయపెట్టింది. ఈ కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కీలక ఆరోపణలు ఎదుర్కొంటుండగా..తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరును సీబీఐ ప్రస్తావించడం సంచలనంగా మారింది. అయితే సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించడాన్ని జగన్ తరపు న్యాయవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కావాలని కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
జగన్కు ముందే తెలుసు..
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిల్ లో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. అఫిడవిట్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించింది. వివేకా హత్య విషయం సీఎం జగన్కు ఉదయం 6: 15 గంటలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి హత్య విషయాన్ని బయట పెట్టకముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది. అయితే వివేకా హత్య విషయాన్ని జగన్ కు అవినాశ్ రెడ్డి చెప్పారా? లేదా? అనేదానిపై దర్యాఫ్తు చేయాల్సి ఉందని చెప్పింది.
కుట్రను చెప్పడం లేదు..
వివేకా హత్య కేసులో విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అవినాశ్ రెడ్డి చెప్పిన సమాధానాలన్నీ పొంతనలేనివని పేర్కొంది. అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. హత్య వెనక జరిగిన కుట్రను అవినాశ్ చెప్పడం లేదని పేర్కొంది. హత్య జరిగిన రాత్రి 12.27 నుంచి 1:10 వరకు అవినాశ్ వాట్సాప్ కాల్స్ మాట్లాడారని వెల్లడించింది.
తప్పించుకుంటున్నారు.
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు కావాలనే హాజరవడం లేదని సీబీఐ అధికారులు తెలిపారు. మే 15 తేదీన విచారణ కోసం నోటీసలు ఇస్తే నాలుగు రోజుల సమయం కావాలని చెప్పారన్నారు. మే 16న నోటీసులు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారని తప్పించుకున్నారన్నారు. మే 19న తల్లి అనారోగ్యం నెపంతో కావాలనే హైదరాబాద్ విడిచి వెళ్లారని చెప్పారు. విచారణకు రావాలని అవినాశ్ కు ఫోన్ చేసి కోరినప్పటికీ రావడం లేదని అధికారులు పేర్కొన్నారు. మే 22వ తేదీ రావాలని మరోసారి నోటీసులు పంపిస్తే ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల వారం రోజులు రానని వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు మే22న కర్నూలు వెళ్లామని..అయితే అక్కడ ఆసుపత్రి వద్ద అవినాశ్ అనుచరులు ఉండడంతో శాంతిభద్రల సమస్య రావచ్చని ఆగినట్లు పేర్కొన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ కోరింది.