ఇండియా ఇక భారత్!.. పేరు మార్చాలంటే ఏం చేయాలి?

ఇండియా ఇక భారత్!..  పేరు మార్చాలంటే ఏం చేయాలి?

రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పేర్లూ ఉన్నాయి. వీటిలో దేనినైనా అధికారికంగా వాడుకోవచ్చు. ఇందుకు ఇబ్బందేమీ లేదు. కానీ రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించి, భారత్ అనే పదాన్ని మాత్రమే ఉంచాలంటే మాత్రం అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 

ఇందుకోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆర్టికల్ 1కి సవరణ చేయాలి. అయితే, రాజ్యాంగ సవరణ చేసేందుకు ఆర్టికల్ 368లో సింపుల్ మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ అనే రెండు విధానాలను పేర్కొన్నారు. రాజ్యసభలో స్టేట్స్, యూటీలకు సీట్ల కేటాయింపు, మార్పుల వంటి వాటికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. 

అంటే.. హాజరైన మొత్తం సభ్యుల్లో 50% కంటే ఎక్కువ ఓట్లు సవరణకు అనుకూలంగా రావాలి. కానీ ఆర్టికల్ 1లోని దేశం పేరు, ఇతర అంశాలను మార్చాలంటే మాత్రం స్పెషల్ మెజారిటీ తప్పనిసరి. ఇందుకోసం పార్లమెంట్ ఉభయసభలకు ఓటింగ్ జరగాలి. హాజరైన మొత్తం సభ్యుల్లో కనీసం 66% ఓట్లు రావాలి.