నీట్ సీటు రాలేదని కొడుకు.. అది తట్టుకోలేని తండ్రి.. 12 గంటల్లోనే ఇద్దరూ..

నీట్ సీటు రాలేదని కొడుకు.. అది తట్టుకోలేని తండ్రి.. 12 గంటల్లోనే ఇద్దరూ..

తమిళనాడులోని చెన్నైలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఆత్మహత్య చేసుకున్న తర్వా కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. క్రోమ్‌పేట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే..

కొడుకు గత రెండేళ్లలో రెండుసార్లు జరిగిన నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం కొడుకు మృతదేహాన్ని దహనం చేసిన కొన్ని గంటల తర్వాత, సెల్వశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను క్రోమ్ పేట్ లో ఫొటోగ్రాఫర్ గా విధులు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. ఆగస్టు 13న చోటుచేసుకున్న ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది.

19 ఏళ్ల ఎస్ జగదీశ్వరన్ 2022లో పన్నెండో తరగతి పూర్తి చేశాడు. అప్పట్నుంచి అతను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) పరీక్షకు రెండుసార్లు హాజరయ్యాడు, కానీ క్లియర్ చేయలేకపోయాడు. దీంతో ఆగస్టు 12న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జగదీశ్వరన్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని తండ్రి సెల్వశేఖర్ తన కుమారుడికి కాల్ చేసినా కలవకపోవడంతో అతని గదిలో చూడమని ఓనర్ ను కోరాడు. అలా అతను జగదీశ్వరన్ గదిని చెక్ చేయడానికి వెళ్లగా.. అక్కడ ఆ యువకుడు ఉరివేసుకుని ఉన్నట్లు వారు గుర్తించారు.

అనంతరం ఇరుగు పొరుగువారి సహాయంతో జగదీశ్వరన్ ను ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అతని ప్రాణాలు నిలవలేదు. అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. జగదీశ్వరన్ రెండుసార్లు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు నిరుత్సాహపడి ఈ చర్యకు పాల్పడ్డడ్డు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కుమారుడి మృతిని తట్టుకోలేక సెల్వశేఖర్ కూడా తుదిశ్వాస విడిచాడు. జగదీశ్వరన్‌ అంత్యక్రియల అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన అతని తండ్రి.. అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

తమిళనాడు సీఎం సంతాపం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. జగదీశ్వరన్, అతని తండ్రి మరణానికి సంతాపం తెలిపారు, “నీట్ లో ఫెయిల్ అయిన క్రోమ్‌పేటకు చెందిన జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి నేను షాక్ అయ్యాను. అతని తల్లిదండ్రులను ఎలా ఓదార్చాలి అని ఆలోచిస్తుండగా.. మరుసటి రోజు అతని తండ్రి సెల్వశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు" అని అన్నారు. “జగదీశ్వరన్ కుటుంబాన్ని, స్నేహితులను, బంధువులను ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. డాక్టర్‌ కావాలని కలలు కన్న ఓ తెలివైన విద్యార్థి ఇప్పుడు నీట్‌ ఆత్మహత్యల జాబితాలో చేరడం దారుణం" అని ఆయన చెప్పారు. దాంతో పాటు విద్యార్థులెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి కోరారు. “నేను విద్యార్థులందరినీ కోరుతున్నాను. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను కోల్పోవద్దని. మీ లక్ష్యాలకు అడ్డంకిగా ఉన్న నీట్‌ని మేము ఖచ్చితంగా తొలగిస్తాం. తమిళనాడు ప్రభుత్వం ఆ దిశగా చట్టపరమైన చర్యలు తీసుకుంటోంద"ని స్టాలిన్ అన్నారు.