
- హైకోర్టు ఆదేశాల మేరకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు
- లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ. 5 లక్షలు
హైదరాబాద్, వెలుగు: పౌరసత్వం వివాదంలో హైకోర్టు ఆదేశాల మేరకు వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్‌కు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టు ద్వారా సోమవారం రూ.25 లక్షలను అందజేశారు. మరో రూ.5 లక్షలను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు ఇచ్చారు. పౌరసత్వ వివాదంపై కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అలాగే, రమేశ్ బాబు పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ. 5 లక్షలు 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.
అప్పీలుకు గడువు ఉన్న నేపథ్యంలో చెల్లింపులో జాప్యం జరిగిందని, 4 రోజులుండగా డీడీని అందజేసినా ఆది శ్రీనివాస్ నిరాకరించడంతో చెన్నమనేని రమేశ్ హైకోర్టులో మెమో దాఖలు చేశారు. రమేశ్‌బాబు తరఫు న్యాయవాది వై.సంకల్ప్ వాదనలు వినిపిస్తూ రూ.5 లక్షలను లీగల్ సర్వీసెస్ అథారిటీకి అందజేశామని, ఆది శ్రీనివాస్‌కు చెల్లించాల్సిన రూ.25 లక్షల డీడీ సిద్ధంగా ఉందన్నారు. ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండున్నర నెలల తర్వాత డీడీ అందజేశారని, ఇది కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నందున తీసుకోలేదని చెప్పారు. జడ్జి ఆదేశాల మేరకు డీడీని ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది
వి. రోహిత్‌రావుకు అందజేశారు.
తప్పుడు పత్రాలతోఎమ్మెల్యేగా కొనసాగారు: విప్ ఆది శ్రీనివాస్
భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలతో చెన్నమనేని రమేశ్‌బాబు వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగారని విప్ ఆది శ్రీనివాస్అన్నారు. కోర్టు ఆధ్వర్యంలో చెన్నమనేని నుంచి రూ. 25 లక్షల డీడీ తీసుకున్న అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మోసపూరితంగా గెలుపొందిన చెన్నమనేని రమేశ్‌బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు.