
- చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ఇచ్చి వినూత్న నిరసన
- రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సొంతపార్టీపైనే కోపం వచ్చింది. దీంతో ఆయన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఒక ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన, తనను ఫుట్‌బాల్ లా ఆడుకుంటున్నారనే విషయాన్ని తెలిపేలా నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఈ అంశం బీజేపీ స్టేట్ ఆఫీసులో చర్చనీయాంశంగా మారింది.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లాల్లోని పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై చర్చించేందుకు స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావును కలిశారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలవమని కొండాకు రాంచందర్ రావు సూచించారు. ఆయన్ను కలిస్తే రాష్ట్ర ఇన్ చార్జ్ అభయ్ పటేల్‌ను కలవాలని సూచించినట్టు తెలిసింది. అభయ్పటేల్ను కలిస్తే ఆయన మళ్లీ రాంచందర్ రావు, తివారిని కలవాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి తివారికి ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపారని తెలుస్తున్నది.