నిండు జీవితాన్ని మసక బారుస్తున్న సిగరెట్

నిండు జీవితాన్ని మసక బారుస్తున్న సిగరెట్

గుప్పు గుప్పున తాగే సిగరెట్లు, బీడీలు, చుట్టలు.. ఆరోగ్యాన్ని  పీల్చి పిప్పి చేస్తున్నాయి . నిండు జీవితాన్ని మసక బారుస్తున్నాయి.  పక్కనోళ్లని కూడా పట్టి పీడిస్తున్నాయి. ఏటా లక్షల ప్రాణాల్ని పొట్టన బెట్టుకుంటున్నాయి. ఇదంతా తెలిసినప్పటికీ.. ‘మనదాకా రాదులే, ఇన్నేండ్ల నుంచి ఉన్న అలవాటు మానేదెలా’  అంటుంటారు చాలామంది. మనిషి తెలిసి చేసే ఈ పొరపాటు వాళ్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా పాడు చేస్తుంది. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు చేసే  హాని గురించి వివరంగా చెప్పారు డాక్టర్​ సి.ఎస్​.రావు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల 80 లక్షల మంది చనిపోతున్నారనేది డబ్ల్యూహెచ్​ఓ రిపోర్ట్​ . వాళ్లలో 70 లక్షల మందిని నేరుగా పొగ కమ్మేస్తుంటే.. 10 లక్షల మంది మాత్రం ఇతరులు వదిలే పొగ పీల్చడం(పాసివ్​ స్మోకింగ్​​)  వల్ల చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులున్న రెండో అతిపెద్ద దేశం మనది. మనదేశంలో వచ్చే  క్యాన్సర్లలో 30 శాతం పొగాకు వల్లే వస్తున్నాయి. పురుషుల్లో వచ్చే క్యాన్సర్స్​​లో నలభై శాతం,  ఆడవాళ్లకి  వచ్చే క్యాన్సర్స్​లో తొమ్మిది నుంచి పన్నెండు శాతం కారణం పొగాకే. మొత్తంగా చూసుకుంటే పొగాకు వల్ల ఏటా నాలుగున్నర లక్షల క్యాన్సర్​ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే అవేర్​నెస్​ ఒక్కటే మార్గం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఈరోజున ‘పొగాకు వ్యతిరేక దినోత్సవం’ జరుపుతోంది. అసలు పొగాకు మనిషిని తన గుప్పెట్లో ఎలా పెట్టుకుంటుందంటే... 

72 క్యాన్సర్​ కారకాలుంటాయి

పొగాకును బీడీ, సిగరెట్, చుట్ట, హుక్కా రూపంలో  తీసుకుంటుంటారు. పొగ రానివి అంటే.. ఖైనీ, గుట్కా, తంబాకు లాంటివి నములుతుంటారు. ఎండిన పొగాకుని పొడి చేసి తయారుచేసే  ముక్కు పొడి(స్నఫ్‌‌)ని పీలుస్తుంటారు. రివర్స్​ చుట్ట స్మోకింగ్​ అంటే మండే చుట్టని నోటి లోపల పెట్టుకునేవాళ్లూ ఉన్నారు. పొగాకు పొడిలో వంట నూనె కలుపుకొని పండ్లు తోముకుంటుంటారు కొన్ని ఏరియాల్లో. ఇవే కాకుండా ఇ– సిగరెట్స్​ కూడా ఉన్నాయి. అయితే పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టం తప్పదు. దానికి ముఖ్య  కారణం పొగాకులో ఉండే ఆర్సిన్​, హైడ్రోజన్​ సయనైట్ , ఫార్మాల్డిహైడ్,  అమ్మోనియా, పొలోనియం– 210, బెంజిన్, కార్బో మోనాక్సైడ్, పాలీ సైక్లిక్​ హైడ్రో కార్బన్స్​  వంటి క్యాన్సర్​కి దారితీసే ​ 72  కెమికల్స్​. ఇవి శరీరంలోని కణాల్ని దెబ్బతీసి వాటిని క్యాన్సర్​ కణాలుగా మారుస్తాయి. క్యాన్సర్​ ప్రమాదమే కాకుండా పొగాకు వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాగే గుండె జబ్బులొస్తాయి. అలాగే శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి.. రక్తనాళాల లోపలి ద్వారాలు సన్నబడతాయి. దీనివల్ల  పెరిఫెరల్​ ​ వాస్క్యులర్​ జబ్బులు వస్తాయి. పొగాకు ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడే సిగరెట్​లో ఏకంగా  600  కెమికల్స్​ ఉంటాయి. ఇన్ కెమికల్స్​తో నిండిన పొగాకుకి జనాలు ఎందుకు ఇంతలా బానిస అవుతున్నారంటే.. దానికి కారణం నికోటిన్​​.  

బానిసగా చేస్తుంది​? 

పొగాకులో నికోటిన్​​ అనే పదార్థం ఉంటుంది. మనిషి పొగ పీల్చిన పది సెకండ్లలో ఇది మెదడును చేరుతుంది. రిసెప్టర్​ల ద్వారా డోపమైన్​ అనే హ్యాపీ హార్మోన్​ని విడుదల చేసి హాయిగా అనిపిస్తుంది. దాంతో ఈ ఆనందాన్ని పదేపదే  పొందేందుకు ఆ పొగాకుకు అలవాటైపోతున్నారు చాలామంది. తర్వాత ఆ పొగకి మెల్లిగా బానిసలు అవుతున్నారు. వాటిలో  రసాయనాలు శరీరమంతా పాకి.. తల నుంచి యూరినరీ ట్రాక్​ వరకు అన్ని భాగాల్ని ఎఫెక్ట్​ చేస్తున్నాయి. ప్రాణం మీదకి తెస్తున్నాయి. ఇవి ఏ అవయవాన్ని ఎలా ఎఫెక్ట్​ చేస్తాయంటే...

ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి

క్యాన్సర్​ మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్​తో చనిపోయే వాళ్ల  సంఖ్య చాలా ఎక్కువ. అలాగే ఈ  క్యాన్సర్​తో చనిపోయే ప్రతి పదిమందిలో పొగతాగడం వల్ల ఆ క్యాన్సర్ బారిన పడ్డ వాళ్లు తొమ్మిది మంది ఉంటున్నారు. దీన్ని బట్టి పొగ ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు ఎలా దెబ్బతింటాయంటే..   మనం గాలి పీల్చుకున్నప్పుడు స్వచ్ఛమైన గాలి మాత్రమే లోపలికి వెళ్లడానికి శ్వాస నాళాల్లో సీలియా అనే వెంట్రుకలు ఉపయోగపడతాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్​ , విష వాయువుల నుంచి ఊపిరితిత్తుల్ని కాపాడతాయి. అయితే పొగతాగే వాళ్లలో  ఈ సీలియా పూర్తిగా దెబ్బతింటుంది. దానివల్ల పొగాకు  పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది.  ఆ పొగాకులో ఉండే ఆర్సెనిక్‌‌, బెంజిన్‌‌, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, తారు .. లాంటి క్యాన్సర్‌‌ కారకాలు కూడా శ్వాసనాళం లేదా రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. క్యాన్సర్‌‌ కణితులుగా ఏర్పడతాయి.  అవి పెరిగేకొద్దీ ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా రక్తంలోకి ఆక్సిజన్‌‌ సరఫరా తగ్గిపోతుంది. ఇదే ఊపిరితిత్తుల క్యాన్సర్​. 

శరీరం మొత్తాన్ని..

పొగాకు వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్​తో పాటు శ్వాస కోశ, జీర్ణ వాహిక, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, ఓరల్​ కావిటీ, నాసల్​ కావిటీ, సర్విక్స్​ క్యాన్సర్​ కూడా వస్తాయి. నోరు​, నాలిక, బుగ్గ, గొంతు, అన్నవాహిక, జీర్ణాశయం, క్లోమం( జీర్ణ రసాలని తయారుచేసే గ్రంథి) , కిడ్నీ, బ్లాడర్​, యానల్​ కెనాల్​​, గర్భకోశ క్యాన్సర్స్​ కూడా వస్తాయి. రివర్స్​ చుట్ట స్మోకింగ్​ వల్ల గొంతు క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి. ముక్కుపొడుం పీల్చితే  ఊపిరితిత్తులు, గొంతు  క్యాన్సర్లతో పాటు సైనస్​ క్యాన్సర్​​ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే 13 నుంచి 15 ఏండ్ల  వయసు మధ్యలో పొగాకుకి అలవాటు పడ్డ వాళ్లకి 35 –40 సంవత్సరాలు వచ్చేసరికి క్యాన్సర్లు​ మొదలవుతాయి. చెయిన్​ స్మోకర్స్​ అంటే రోజుకి అరవై నుంచి ఎనభై సిగరెట్స్​ తాగుతుంటారు. వీళ్లకి 17 శాతం ఎక్కువ క్యాన్సర్లు వస్తుంటాయి. రోజుకి రెండు, నాలుగు సిగరెట్లు తాగేవాళ్లకి ఏడు నుంచి తొమ్మిది శాతం ఎక్కువ క్యాన్సర్లు వస్తుంటాయి. వీటితో పాటు  పొగాకు మానసికంగానూ మనిషిని ఎఫెక్ట్​ చేస్తుంది. 

సంతానలేమికి

మన దేశంలో 8-–12 శాతం ఆడవాళ్లు పొగ తాగుతున్నారు. వీళ్లలో ఇన్​ఫెర్టిలిటీ అవకాశాలు ఎక్కువ. మగవాళ్లలోనూ పొగాకు ఈ సమస్యకి దారితీస్తోంది. ఇవి కాకుండా ‘స్మోకర్స్ కాఫ్’ అంటే  పొద్దున్నపూట దగ్గు, నంజుతో కూడిన ఉమ్మి ఎక్కువగా వస్తుంటుంది పొగతాగే వాళ్లకి. పల్మనరీ జబ్బులు వస్తాయి. పొగ వల్ల కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతిని ఎక్కువ దూరం నడిస్తే కాళ్లు నొప్పులు వస్తాయి. ఈ సమస్య తీవ్రమైతే కాళ్లు తీసేయాల్సి రావచ్చు కూడా. 

భూమిని కూడా కాల్చేస్తోంది 

పెట్రోల్​,  డీజిల్​​ పొగలకి తోడు సిగరెట్ పొగ తోడైతే స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది? . పైగా పొగాకు ఉత్పత్తుల తయారీ కోసం సంవత్సరానికి  600  మిలియన్​ల చెట్లని కొట్టేస్తున్నారు. రెండు లక్షల హెక్టార్ల భూమిని కెమికల్స్​తో నింపేస్తున్నారు. 22  బిలియన్​ టన్నుల నీళ్లు ఖర్చు అవుతున్నాయి. 81 మిలియన్​ల​ టన్నులు  కార్బన్​ డై ఆక్సైడ్​ని  వదులుతున్నారు. వీటిన్నింటి వల్ల భూమి కూడా విషంగా మారుతోంది. అందుకే ఈ సంవత్సరం ‘‘పొగాకు: పర్యావరణానికి ముప్పు​” అనే థీమ్​తో  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతోంది డబ్ల్యూహెచ్​ఓ. 

సిగరెట్​ మానేశాక.. 

  •   సిగరెట్​ మానేసిన ఆరు గంటల తర్వాత శరీరంలో ఆక్సిజన్​ లెవల్స్​ పెరుగుతాయి. *మూడు నెలల్లో గొంతు, ఊపిరితిత్తుల నొప్పులు తగ్గుతాయి. 
  •   తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం కూడా కంట్రోల్​ అవుతాయి. 
  •   ఐదేండ్ల తర్వాత పెరాలసిస్​ స్ట్రోక్స్​ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 
  •   పదేండ్లలో ఊపితిత్తుల క్యాన్సర్​ వచ్చే అవకాశాలు 50 శాతం , పదిహేనేండ్ల తర్వాత​ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

అందుకని  వీలైనంత త్వరగా పొగ భూతాన్ని వదలాలి.  మీ వల్ల కావట్లేదంటే  కౌన్సెలర్​ని కలవాలి. వాళ్లు ఆ అలవాటు మానడానికి నికోటిన్​ బబుల్​గమ్స్, ప్యాచ్​లు​ ఇస్తారు. నెల రోజుల తర్వాత వాటి డోస్​ తగ్గిస్తారు. అయితే ఈ ప్రాసెస్​ అంత తేలికని చెప్పలేం. పొగ మానేస్తే చిరాకు, కోపం, నిస్సహాయత కనిపిస్తాయి. ఎలాగైనా మానాలన్న పట్టుదల ఉంటేనే పొగ మత్తు నుంచి బయటపడతారు. 

డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు
ఛైర్మన్ & చీఫ్ సర్జికల్ 
ఆంకాలజీ సర్వీసెస్,
రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్