
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కు టూరిస్టులను రప్పించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు అన్ని విమాన సర్వీసులను పునరుద్ధరించామని చెప్పారు. భారత్ లోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు జమ్మూకాశ్మీర్ ను సందర్శించడానికి రావాలని కోరారు. ఇండో– పాక్ ఉద్రిక్తతలతో మూసేసిన శ్రీనగర్ ఎయిర్ పోర్టులో బుధవారం కార్యకలాపాలు ప్రారంభ కావడంతో దానిని ఆయన సందర్శించారు. ఈ మేరకు గురువారం శ్రీనగర్ లో మీడియాలో ఆయన మాట్లాడారు. “శ్రీనగర్ కు అన్ని విమాన సర్వీసులను పునరుద్ధరించాం. పర్యాటకం, ఆర్థికం, వాణిజ్యపరంగా ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు కాశ్మీర్ సురక్షితంగా ఉంది. భారత్ లోని ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికొచ్చి ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి సాయం అందించాలి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హోదాలో శ్రీనగర్ ఎయిర్ పోర్టులోని పరిస్థితిని సమీక్షించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బందిని వ్యక్తిగతంగా కలిసి వారిని ధైర్యం చెప్పాలనుకున్నాను” అని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.