వరి సాగు.. వడ్ల కొనుగోళ్లపై తాపకో మాట

 వరి సాగు.. వడ్ల కొనుగోళ్లపై తాపకో మాట

హైదరాబాద్, వెలుగు: వరి సాగు, వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ గడిచిన రెండేండ్లలో రకరకాలుగా మాట మార్చారు. రైతులు కోటి ఎకరాల్లో వరి వేసినా.. ప్రతి గింజ కొంటామని 2020 మార్చి 7న అసెంబ్లీలో చెప్పింది మొదలు.. సోమవారం నాటి ప్రెస్​మీట్​లో  కేంద్రం.. బియ్యం కాదు, వడ్లే కొనాలనే డిమాండ్ వరకు గడికో మాట మాట్లాడారు. వరి సాగు కంట్రోల్​ చేయాలని ఆఫీసర్లకు టార్గెట్ ఇవ్వటంతో పాటు.. చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని ఆంక్షలు పెట్టారు. సన్నాలకు ఎక్కువ ధర ఇప్పిస్తమని చెప్పి కొనుగోళ్ల టైమ్​లో చేతులెత్తేశారు. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోనంటోందని.. నిరుడు వానాకాలం పంటను కొనకుండా రెండు నెలలు లేట్​ చేశారు. దీంతో పదుల సంఖ్యలో రైతులు కళ్లాల్లో, వడ్ల కుప్పలపై ప్రాణాలు విడిచారు. ఈ సారి యాసంగిలో ఏకంగా  వరి వేస్తే ఉరే అని ప్రకటించారు. 

2020 మార్చి 7
కోటి ఎకరాల్లో పండించినా.. ప్రతి గింజ కొంటం
ఈ యాసంగిలో 38 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇది చాలా పెద్ద రికార్డు. నేను ఇంకా వరి వేయండనే చెపుతున్న. వరి పంట రేపటి నాటికి 88 లక్షలు..99 లక్షలు అయితది. కోటి ఎకరాలు అయితది. ఏం బాధ లేదు. ఎవడేడువని.. అరువని.. శాపం పెట్టుకోని. రైతు పండించిన ప్రతి గింజ కొంటం. 

2020 మే 18
మేం చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు
మార్కెట్లో డిమాండ్​ ఉండే సరుకులే పండించి మంచి ధరలు పొందాలె. వర్షాకాలంలో 40 లక్షల ఎకరాల్లో వరి చేన్లు వేద్దాం. అయితే ఏ రకాలు వేయాలనేది ప్రభుత్వం చెపుతది. ఆ రకాలే వెయ్యాలే. ప్రభుత్వం చెప్పింది వెయ్యకుండా.. వేరే వేస్తే వాళ్లకు రైతుబంధు రాదు. 

2021 సెప్టెంబర్ 12
వరి వేస్తే ఉరే
వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరివేసుకోవడమే. ఒక్క కిలో బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ను కూడా కొనలేమని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఇక ముందు వరి పంట వేయటం శ్రేయస్కరం కాదు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండించాలి.

2021 నవంబర్ 29
రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనదు
యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవు. రైతులకు నేను క్లియర్​గా చెపుతా ఉన్న. వడ్లు ప్రభుత్వం కొనదు. రైతులు ఆలోచించుకోవాలి. మా తిండి కోసం వేసుకుంటం.. అంటే వేసుకోవచ్చు. విత్తన కంపెనీలు కొంటాయంటే.. వాళ్లు వేసుకోవచ్చు. మిల్లర్లతో ఒప్పందం ఉంటే వేసుకోవచ్చు. 

2022 మార్చి 21
రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనాలి
రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎంఎస్పీ ఇచ్చేది వడ్లకే కానీ బియ్యానికి కాదు. పంజాబ్‌లో ఎట్లా కొనుగోలు చేస్తున్నరో తెలంగాణ లో కూడా అట్లనే కొనుగోలు చేయాలి. కొన్న వడ్లను రా రైస్ చేసుకుంటరో, బాయిల్డ్ రైస్ చేసుకుంటరో, బాగోతం ఆడుకుంటరో కేంద్రం ఇష్టం

2020 మార్చి 30

వడ్లు, బియ్యానికి కొత్త విధానం తెస్తం
(ఆఫీసర్ల రివ్యూలో కేసీఆర్​)
‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం’ రూపొందిస్తాం. రాష్ట్రంలో వరిసాగు పెరుగుతున్నది. ఈ సారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. కోటి లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉంది. రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం సమగ్ర ధాన్యం, బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై మంత్రివర్గం, అసెంబ్లీలో  చర్చించి, ఆమోదిస్తాం.

2021 అక్టోబర్ 31
సన్నాలు వేయండి.. ధర ఎక్కువిప్పిస్త
 (తొర్రూర్ లో రైతు వేదిక ప్రారంభ సభ)
సన్నవడ్లు వెయ్యండయ్యా. మార్కెట్లో ధర మంచిగుంటది. ధర దొరుకుతదని చెప్పిన. ఎస్​... దొరికి పిస్తం.. కేసీఆర్​ కదా. ఖచ్చితంగ దొరికి పిస్తం. ఎట్ల దొరకదు. 1888 రూపాయలకి దొడ్డువి కొంటున్నరు.  సన్నవాటికి నూరు నూటయాభై ఎక్కువ రావాలి కదా. వచ్చేటట్టు చేస్త. గ్యారంటీ చేస్త. వంద శాతం చేస్త.   ఖచ్చితంగా చేస్త. దానికి అనుమానమే అవసరం లేదు.  

2021 నవంబర్ 16
కొనకుంటే.. కేంద్రాన్ని వెంటాడుతం 
(తెలంగాణ భవన్​లో ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)
వడ్ల కొనుగోళ్లపై కేంద్రాన్ని, బీజేపీని వెంటాడుతాం, వేటాడుతాం.. ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని అడిగితే 50 రోజులుగా ఉలుకూ పలుకూ లేదు.. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాటానికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులుగా ప్రశ్నిస్తం. మేము భయంకరమైన ఉద్యమకారులం.. ఎంతకైనా తెగిస్తాం.. వెన్కకు పోయే ప్రసక్తే లేదు.. తెలంగాణ నుంచి ఏడాదిలో ఎంత వరి ధాన్యం తీసుకుంటుందో ఎఫ్​సీఐ చెప్పాలి. అదే డిమాండ్​తో రాష్ట్ర కేబినెట్ ఇందిరాపార్క్​ వద్ద ధర్నా చేస్తుంది.

2021 నవంబర్ 20
చివరి గింజ వరకు కొంటం
(ప్రగతి భవన్ లో ప్రెస్​మీట్)
చివరి గింజ వరకు ఈ వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తది. తప్పకుండ మీకు డబ్బులు కూడా చెల్లిస్తది. యాసంగిలో ఏ పంటలు పండియ్యాలనేది ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత.. మరి వరి వెయ్​మంటరా.. వెయ్యొద్దంటరా.. ఆ కేంద్రం యొక్క నీతి ఏందీ.. తెలిస్తే. వాళ్లు బీరాలు పలికిండ్రా.. వట్టిగనే చెప్పిండ్రా.. అవన్ని తేలిపోతయి.

2021 నవంబర్ 28
కేంద్రం తక్కువ కొంటా అంటోంది
(పార్లమెంటరీ పార్టీ మీటింగ్​ టీఆర్​ఎస్ భవన్)
రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటే..కేవలం 60 లక్షల మెట్రిక్​ టన్నులు(40 లక్షల టన్నుల బియ్యం) మాత్రమే సేకరిస్తామని కేంద్రం పాత పాట పాడుతోంది. ఆహార ధాన్య సేకరణకు కేంద్రం జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే జాతీయ విధానం ఉండాలని పార్లమెంట్​లో డిమాండ్ చేయాలి.

2012 నవంబర్ 29
వడ్లు ఇండియా గేట్​ దగ్గర పారబోస్తం
యాసంగి వడ్లకు నూకశాతం ఎక్కువ వస్తది. వానాకాలం పంటకు 67 కిలోల బియ్యం వస్తది. యాసంగిలో వడ్లకు 35 కిలోలే వస్తది. ఆ నష్టం ఎవరు భరించాలి. రైతు భరించలేడు పాపం. అట్ల చేస్తే నా మిల్లు అమ్ముకోవాలని మిల్లరు అంటడు. మరి ఆ నష్టం ఎవరు భరించాలే..? బాయిల్డ్ రైస్ కేంద్రం కొనబోమంటోంది. యాసంగిలో వచ్చేదే బాయిల్డ్ రైస్​. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినందున రాష్ట్రం ధాన్యం సేకరించబోదు. కేంద్రం హామీ ఇవ్వక పోయినా వానాకాలం వడ్లను మేం కొంటం. కేంద్రం తీసుకోకపోతే ప్రధాని ఆఫీసు ముందు, కిషన్​రెడ్డి ఇంట్ల, బీజేపీ ఆఫీసు ముందు, ఇండియా గేట్ కాడ పారబోస్తం.