పద్మ శ్రీ పొందిన మొగిలయ్యకు సీఎం కేసీఆర్ సత్కారం

పద్మ శ్రీ పొందిన మొగిలయ్యకు సీఎం కేసీఆర్ సత్కారం

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ కళాకారుడు 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్యకు పద్మ శ్రీ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇవాళ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అలాగే మొగిలయ్యకు తన అవసరాల కోసం రూ.కోటి నగదును ఇస్తున్నట్లు తెలిపారు.


తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని కేసీఆర్ చెప్పారు.

12 మెట్ల కిన్నెర వాయిద్యాన్ని అద్భుతంగా వాయించే కళాకారుడు దర్శనం మొగిలయ్య.. ఎన్నో ఏండ్లుగా పేదరికంలో ఉన్నా ఆ కళను కాపాడడం మానలేదు. పల్లెపాటలతో చెవికి ఇంపుగా కిన్నెరను వాయిస్తూ ఆ కళపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారాయన. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో టైటిట్ సాంగ్‌లో ఆయన కిన్నెరను వాయిస్తూ మొదటి చరణాలను పాడిన తీరుకు అ సాంగ్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిన్నెర మొగిలయ్య అంటే తెలియని వారు లేరనేంతలా ఈ పాట ఆయనను జనానికి దగ్గర చేసింది.

మరిన్ని వార్తల కోసం..

కరోనా ఫ్యామిలీలో మరో వైరస్ గుర్తించిన చైనా

రెండు రాష్ట్రాలకు అప్పుల లిమిట్ పెంచిన కేంద్రం

బ్రహ్మోస్‌ మిస్సైల్ ఎగుమతికి భారత్‌కు తొలి ఆర్డర్