
కాకా వెంకటస్వామి వర్థంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాగ్ లింగంపల్లిలోని జరిగిన బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రామాయణంలో వివేక్, వినోద్ లవకుశులని కొనియాడారు. అంబేద్కర్ విద్యా సంస్థల విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. సరోజా వివేక్ అధ్వర్యంలో పేద పిల్లలకు ఇక్కడ మెరుగైన విద్య అందుతుందని వెల్లడించారు. పేద విద్యార్థులకు ఎలాంటి లాభపేక్ష లేకుండా విద్యను అందిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందన్న సీఎం రేవంత్ .. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని చెప్పుకొచ్చారు. బీఆర్ అంబేద్కర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఏ చేయూత కావాలన్న సిద్దమని రేవంత్ హామీ ఇచ్చారు. అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ పాల్గొన్నారు.