
- నేటి నుంచి నియోజకవర్గాల్లో పంపిణీ షురూ
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన కొత్త కార్డుల సంఖ్య, చేరికలు
మహబూబాబాద్/ జనగామ, వెలుగు : ఏండ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నేటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా పేదలకు రేషన్‌కార్డులు అందించనున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు అందజేయనుండగా, కొత్తగా చేరిన వారి సంఖ్య కూడా పెరిగింది. ఇందుకోసం జిల్లాల వారీగా మార్పులు చేర్పులు, కొత్త వారి ఎంపికను అధికారులు పూర్తి చేశారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,305 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరుకులు అందజేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో వివిధ ఆహార భద్రత కార్డులు బీపీఎల్, ఏఏవై, ఈహెచ్ హెచ్కార్డులు మొత్తంగా 2,40,535 రేషన్ కార్డులున్నాయి. మీసేవ కేంద్రాల ద్వారా 40,002 మంది, (1,18,389 మంది సభ్యులకు) రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు ఆర్ఐల లాగిన్‌లో 4,248 దరఖాస్తులు, తహసీల్దార్ల లాగిన్‌లో284 , డీఎస్వో లాగిన్‌లో 300 దరఖాస్తులు పెండింగ్ లోఉన్నాయి.
అధికారులు వాటిని పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఇప్పటి వరకు 34578 రేషన్ కార్డులకు ఆమోదం లభించగా, 44330 మంది కుటుంబ సభ్యుల పేర్లు కొత్తగా చేర్చారు. హనుమకొండ 413, వరంగల్ 500, జనగామ335, మహబూబాబాద్558, భూపాలపల్లి 277, ములుగు 222 ఇలా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,305 రేషన్‌షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు.
సీఎం సందేశంతో మంజూరు పత్రం..
తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్‌కార్డు అందించనున్నది. ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారంటూ సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫొటోలతో ఉన్న మంజూరు పత్రాన్ని అందజేయనున్నారు. ఇందులో రేషన్‌కార్డు నెంబర్, లబ్ధిదారు పేరు, రేషన్‌దుకాణం నెంబర్, కుటుంబ సభ్యుల సంఖ్య కలిగి ఉన్న రేషన్మంజూరు పత్రాన్ని లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీరుస్తుంది..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదల ఆకలి తీరుస్తుంది. గతంలో రేషన్‌షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపేవారు కాదు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీతో ప్రతి కుటుంబం పొందుతున్నారు. కాంగ్రెస్ప్రజా ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయడం, అదనపు కుటుంబ సభ్యుల పేర్ల నమోదుతోపాటు నాణ్యమైన సన్న బియ్యం అందిస్తూ పేదలకు అండగా నిలుస్తుంది.- భూక్య మురళీ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే
ఈ నెల 10వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా రేషన్ కార్డుల వివరాలు..
జిల్లా రేషన్ షాపులు పాతవి కొత్తవి చేర్చిన కుటుంబ సభ్యులు
వరంగల్ 500 266694 7331 23639
హనుమకొండ 413 231516 13718 42395
జనగామ 335 163282 10881 35070
మహబూబాబాద్ 558 240535 34578 44330
భూపాలపల్లి 277 125588 6478 19471
ములుగు 222 94628 6931 20190