పది రోజుల్లో రైతుబంధు పూర్తి చేయండి..ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

పది రోజుల్లో రైతుబంధు పూర్తి చేయండి..ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
  •     ఇప్పటివరకు 4 ఎకరాల వాళ్లకు సాయం 
  •     ఉద్యోగుల జీతాల తర్వాత రైతుబంధుకే ప్రయార్టీ     
  •     ఖరీఫ్ నుంచి రైతు భరోసా అమలు.. సీలింగ్ పైనా కసరత్తు

హైదరాబాద్, వెలుగు : రైతుబంధు కింద యాసంగి సీజన్ పెట్టుబడి సాయం పంపిణీని వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 4 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయింది. మిగిలిన వారికి కూడా లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఇంకో రూ.3,500 కోట్లు రిలీజ్ చేస్తే యాసంగి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. దీంతో వారం, పది రోజుల్లో రోజూ కొంత మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని చెప్పారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌‌ సర్కారు రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనుంది. కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. రైతుభరోసా గ్యారంటీని రానున్న ఖరీఫ్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు

సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి కూడా రైతుబంధు సాయం అందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పథకానికి సీలింగ్ పెట్టడంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నోళ్లకు పెట్టుబడి సాయం అవసరం లేదని కొత్త సర్కారు భావిస్తున్నది. 

5 లేదా 10 ఎకరాలకు పరిమితం? 

రైతుభరోసా సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని తెలుస్తున్నది. నిరుడు వానాకాలంలో 68.99 లక్షల మందికి రైతుబంధు సాయం అందింది. వీరిలోఎకరాలోపు భూమి ఉన్న రైతులే అత్యధికంగా 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలే.

ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో మొత్తం 25.57 లక్షల ఎకరాల భూమి ఉంది. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90 శాతంపైగా మందికి భూములు ఐదు ఎకరాలలోపే ఉన్నాయి.