ఆదిలాబాద్​ జిల్లాలో వేగంగా ప్రజావాణి అర్జీల పరిష్కారం : కలెక్టర్ అభిలాష అభినవ్

ఆదిలాబాద్​ జిల్లాలో వేగంగా ప్రజావాణి అర్జీల పరిష్కారం : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్/నస్పూర్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూసమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల అంశాలపై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రజావాణి దరఖాస్తులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలన్నారు.

 ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా సిద్ధం చేయాలని, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణి 91005 77132 నంబరుకు కాల్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్, బెల్లంపల్లి అర్డీవో హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భీమారం, హాజీపూర్ మండలాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని చర్యలు తీసుకోవాలని, బెల్లంపల్లిలోని సమీకృత కూరగాయల మార్కెట్​లో షట్టర్లు ఇప్పించాలని, లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ణయించి చెరువు కబ్జా కాకుండా కాపాడాలని దరఖాస్తులు అందించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 148 దరఖాస్తులు

ఆదిలాబాద్ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 148 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ రాజర్షి షా తెలిపారు. అడిషనల్ ​కలెక్టర్​శ్యామలాదేవీతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలు మండలాల నుంచి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, పంచాయతీ, విద్య, రెవెన్యు, తదితర శాఖలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.