
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, వెలుగు : వనపర్తి జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పెబ్బేరు, పాన్ గల్ రోడ్డు లో విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో మున్సిపాలిటీ, రోడ్లు భవనాలు, పబ్లిక్ హెల్త్ అధికారులతో రోడ్డు విస్తరణ పనులు, పబ్లిక్ హెల్త్ ద్వారా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న 23 కుటుంబాలకు ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామని, మిగతా వారికి టీడీఆర్ కింద లబ్ధి చేకూర్చుతామని తెలిపారు.
రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాలని వనపర్తి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్డు పక్కన ఆక్రమణ చేసిన యజమానులకు నోటీస్ జారీ చేసి అక్రమ నిర్మాణాలు తొలగించాలని సూచించారు.
మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ స్టూడెంట్లు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బందితో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఫలితాలతోపాటు అడ్మిషన్లు సైతం చాలా తక్కువగా ఉన్నాయన్నారు. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని సూచించారు. స్టూడెంట్లు, లెక్చరర్ల ఫేషియల్ అటెండెన్స్ పక్కాగా ఉండాలన్నారు.
డిజిటల్ లైబ్రరీని వినియోగించుకోవాలి
వనపర్తి, వెలుగు : జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్సురభి సూచించారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పాఠకులకు పలు సూచనలు చేశారు. డిజిటల్ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సేవల గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ గ్రంథాలయం ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు కావాల్సిన అన్ని రకాల సమాచారం, దినపత్రికలు, ఆన్లైన్ క్లాసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా లైబ్రరీ బిల్డింగ్ మొదటి అంతస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.