ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు : కలెక్టర్ బాదావత్ సంతోష్

ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు : కలెక్టర్ బాదావత్ సంతోష్

కోడేరు, వెలుగు : -రైతులకు ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని  కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా చూడాలని, అవసరమైతే ఉదయం 6 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

 కృత్రిమ కొరత సృష్టించవద్దని చెప్పారు. యూరియా సరఫరాలో జాప్యం చేయకుండా చూడాలని, ఎక్కడ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెద్దకొత్తపల్లి వ్యవసాయ కేంద్రంలో యూరియాను ఒకే దగ్గర డంప్ చేయడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, సహకార సంఘాల గోదాముల్లో రోజువారి యూరియా స్టాక్ ను పర్యవేక్షించాలని చెప్పారు. అనంతరం పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతుల ఖాతాల్లో 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయశాఖ అధికారి శిరీష, డీపీఎం కృష్ణయ్య, ఏపీఎం సంతోష్, కమిటీ మెంబర్స్ తదితరులు ఉన్నారు. 

ఓటర్ల జాబితా సజావుగా రూపొందించాలి

నాగర్ కర్నూల్ టౌన్  : జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికల ఓటర్ల జాబితాను సజావుగా రూపొందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో అడిషనల్ కలెక్టర్ దేవ సహాయంతో కలిసి మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31న వార్డుల వారీగా పోలింగ్‌‌‌‌ స్టేషన్లను పునర్​ వ్యవస్థీకరించి.. అదే రోజు ఓటర్ల రోల్స్‌‌‌‌లో డేటాను చేర్చాలని సూచించారు. జనవరి 1న పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలను స్వీకరించి, అనంతరం నోటీస్ బోర్డులపై డ్రాఫ్ట్‌‌‌‌ ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని వివరించారు.