నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లోజాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూస్తున్నామన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి వివిధ శాఖల్లో ఉద్యోగ భర్తీలు చేపడుతున్నట్లు చెప్పారు. హక్కులు పొందడంతో పాటు బాధ్యతలు నిర్వర్తించడం కీలకమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి, గెలిచిన సర్పంచ్‌లను ఐదు బ్యాచ్‌లుగా విభజించి నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సంఘాలకు విస్తృతంగా బ్యాంకు రుణాలు అందిస్తున్నామని, రూ.44.95 కోట్ల వడ్డీ రాయితీ పంపిణీ చేసినట్లు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జిల్లాలో ఇప్పటివరకు రూ.329 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ రాయితీ కింద రూ.30.73 కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది 1,17,886 మంది కూలీలకు పని కల్పించి రూ.40.52 కోట్ల వేతనాలు చెల్లించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
