
నార్కట్పల్లి, వెలుగు : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించే సమయంలో రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. బుధవారం నార్కట్ పల్లి మండలం శాపల్లి శివారులో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు, లారీల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈనెల 2, 5న కొనుగోలు కేంద్రం నుంచి లారీలు ధాన్యాన్ని తరలించగా, ఆ వివరాలు రికార్డులో నమోదు చేయకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు రెండు లారీలు కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీశ్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, జిల్లా సహకారశాఖ అధికారి పత్యానాయక్, తహసీల్దార్వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.
భూభారతి చట్టంతో రైతులకు మేలు
నకిరేకల్, వెలుగు : భూభారతి చట్టంతో రైతులకు మేలు జరగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం చందనపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. భూభారతి సదస్సులో రైతుల భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.