వానాకాలం సీజన్ మిల్లింగ్ మరింత ఆలస్యం

వానాకాలం సీజన్ మిల్లింగ్ మరింత ఆలస్యం

నిర్మల్, వెలుగు: రైస్ మిల్లర్లు గడువు లోగా సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) ను సివిల్​సప్లై శాఖకు తిరిగి ఇవ్వకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోంది. మిల్లర్లు పథకం ప్రకారమే ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్దేశించిన గడువు లోగా సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ఇవ్వాలంటూ అధికారులు మిల్లర్లకు పలుసార్లు వార్నింగ్​ ఇచ్చారు.  మిల్లింగ్​ చేయడానికి గడువు కూడా పెంచారు. మిల్లుల కెపాసిటీని ప్రాతిపదికగా  చేసుకొని నిర్మల్ జిల్లాతో  పాటు సమీపంలో  ఉన్న పెద్దపల్లి మరికొన్ని జిల్లాలకు సీఎంఆర్​ కోసం ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అయితే సివిల్​ సప్లై శాఖ ఇచ్చిన గడువులు దాటిపోతుండడం, మళ్లీ ఇంకా సమయం పెంచుతుండటం రివాజుగా మారింది. 

ఎంత సీఎంఆర్ రావాలంటే.. 

98,776  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు అందించారు.  దీని ప్రకారం రైస్ మిల్లులు 66,596 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద తిరిగి ఇవ్వాల్సి ఉంది. మూడు సీజన్లు దాటినప్పటికీ ఇప్పటివరకు రైస్ మిల్లర్లు కేవలం 40,927.481 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు.  మరో 25,668 మెట్రిక్ టన్నుల బియ్యా న్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. మూడు, నాలుగు సార్లు గడువు పెంచినా మిల్లర్లు సీఎంఆర్ బియ్యంను పూర్తిస్థాయిలో తిరిగి ఇవ్వలేదు. ఇంకా టైం పెంచాలని మిల్లర్లు కోరుతున్నట్లు సమాచారం. 

వానాకాలం సీఎంఆర్ పై అయోమయం...

2022–23  ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 1,68,177 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు పౌర సరఫరాల శాఖ కేటాయించింది. 1,12,678 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కోసం తిరిగి ఇవ్వాల్సి ఉంది.  గత రబీ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని  పూర్తి స్థాయిలో ఇవ్వని రైస్ మిల్లులు ఖరీఫ్  సీఎంఆర్ బియ్యాన్ని ఎప్పటిలోగా తిరిగి ఇస్తాయోనన్న సందేహాలు నెలకొన్నాయి.

మొదలైన యాసంగి కొనుగోళ్లు.. 

జిల్లాలో  మొత్తం 204  కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రస్తుత యాసంగి సీజన్ లో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇప్పటివరకు కేవలం 26 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.  కేవలం ఏడు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదని చెబుతున్నారు. గత రబీ,  ఖరీఫ్ సీజన్ లకు కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ ఇప్పటికే పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ వ్యవహారం ఎలా ఉండబోతుందో ఆసక్తి కలిగిస్తోంది.