డిగ్రీ సిలబస్ పై గందరగోళం..ఫస్ట్ సెమిస్టర్ ప్రారంభమైనా కొత్త సిలబస్ రిలీజ్ కాలే

డిగ్రీ సిలబస్ పై గందరగోళం..ఫస్ట్  సెమిస్టర్  ప్రారంభమైనా కొత్త సిలబస్  రిలీజ్ కాలే
  • ఫస్ట్  సెమిస్టర్  ప్రారంభమైనా కొత్త సిలబస్  రిలీజ్ కాలే 
  • ఆందోళనలో లెక్చరర్లు, స్టూడెంట్లు
  • వెంటనే కొత్త సిలబస్  ప్రకటించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల కొత్త సిలబస్ పై అయోమయం నెలకొంది. ఫస్టియర్  క్లాసులు మొదలైనా ఇప్పటికీ సిలబస్​పై యూనివర్సిటీలు స్పష్టత ఇవ్వలేదు. దీంతో క్లాసులో ఏ సిలబస్  బోధించాలో తెలీక లెక్చరర్లు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ మేనేజ్ మెంట్ల పరిధిలో 957 డిగ్రీ కాలేజీలు ఉండగా.. ఏటా సుమారు 2 లక్షల మంది చేరుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో డిగ్రీ సిలబస్  మార్చాలని విద్యా శాఖ నిర్ణయించింది. 

దీనికి అనుగుణంగా అన్ని వర్సిటీల్లో కామన్  సిలబస్  కోసం హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్ ప్రయత్నాలు చేసింది. దీంట్లో భాగంగా బీకామ్, లా తదితర  కోర్సుల్లో సిబలస్  మార్పులకు కౌన్సిల్  చైర్మన్  బాలకిష్టారెడ్డి, బీఎస్సీ గ్రూపుల్లోని సబ్జెక్టులకు వైస్ చైర్మన్  మహమూద్, సోషల్  స్టడీస్ కు సంబంధించిన సబ్జెక్టులకు మరో వైస్ చైర్మన్  ఇటిక్యాల పురుషోత్తం, ఇంజినీరింగ్  సబ్జెక్టులకు సంబంధించి కౌన్సిల్  సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్  నేతృత్వంలో సబ్జెక్టు కమిటీలను ఏర్పాటు చేశారు. 

నిపుణులతో కూడిన ఈ కమిటీలు పలుమార్లు సమావేశమై సిలబస్, క్రెడిట్స్ ను కూడా ఫైనల్  చేశాయి. ఈ ప్రక్రియ అంతా నెల క్రితమే పూర్తయింది. అయితే.. గత నెల 30న డిగ్రీ ఫస్టియర్  క్లాసులు మొదలయ్యాయి. అయినా, ఇప్పటికీ సిలబస్​ రిలీజ్  చేయలేదు. హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  ఆధ్వర్యంలో రూపొందించిన వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ను యూనివర్సిటీల బోర్డ్  ఆఫ్  స్టడీస్ కు పంపించామని కౌన్సిల్  అధికారులు  చెప్తున్నారు. కానీ.. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే బీఎస్సీ జువాలజీ సిలబస్ ను అధికారికంగా వెల్లడించింది. మిగిలిన సైన్స్, ఆర్ట్స్, ఇతర కోర్సుల  సిలబస్​ను ఇంతవరకూ ఏ వర్సిటీ ప్రకటించలేదు. దీంతో ఇటు లెక్చరర్లు, అటు స్టూడెంట్లలో అయోమయం నెలకొంది. 

లాంగ్వేజీలపై స్పష్టత కరువు

సబ్జెక్టు ఎక్స్ పర్ట్  కమిటీలు తొలుత లాంగ్వేజీ సబ్జెక్టును కుదించాలని భావించాయి. దీంతో నాలుగు సెమిస్టర్లకు 12 క్రెడిట్స్  ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే, దీనిపై తెలుగుతో పాటు ఇతర సబ్జెక్టు లెక్చరర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆరు సెమిస్టర్లలో 20 క్రెడిట్స్ పెట్టాలని డిమాండ్  చేస్తూ ఆందోళనలు చేశారు. 

దీంతో ఏం చేయాలనే దానిపై కౌన్సిల్  అధికారులు ఆలోచనలో పడ్డారు. అప్పటికే  4 సెమిస్టర్లు,  12 క్రెడిట్స్ అని నిర్ణయించిన నేపథ్యంలో, వీటిపై నిర్ణయాన్ని యూనివర్సిటీ వీసీలకు అప్పగించారు. కాగా.. 20 క్రెడిట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. సెమిస్టర్లను మాత్రం నాలుగే కొనసాగించాలని భావిస్తున్నారు. 

సిలబస్  ప్రకటించాలె: రమేశ్, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ డిగ్రీ ఫస్టియర్  క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సులకు సంబంధించి సిలబస్  ప్రకటించలేదు. దీనికోసం ఇప్పటికే ఉన్నతాధికారులకు  విన్నవించాం. వెంటనే కొత్త సిలబస్​  రిలీజ్  చేయాలి. ప్రస్తుతం కొత్తగా వచ్చిన స్టూడెంట్లకు సబ్జెక్టు ఒరియంటేషన్ క్లాసులు చెప్తున్నాం.