బుజ్జగింపులకో కమిటీ .. ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ 

బుజ్జగింపులకో కమిటీ .. ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ 
  • సభ్యులుగా జానారెడ్డి సహా నలుగురు
  • అసంతృప్తులతో చర్చలు జరపనున్న కమిటీ
  • పార్టీ అనుబంధ సంఘాలు, వివిధ వర్గాల నేతలతోనూ భేటీ 

హైదరాబాద్, వెలుగు : టికెట్లు ప్రకటించక ముందే అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్​నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. ఇందులో సీనియర్​ నేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్​రావ్​ ఠాక్రే, దీపాదాస్​ మున్షి, మీనాక్షి నటరాజన్​కు చోటు కల్పించింది. కాంగ్రెస్ లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలోని వివిధ వర్గాల నేతలు, అనుబంధ సంఘాల లీడర్లు, ఓయూ విద్యార్థి నాయకులు.. ఇప్పటికే తమ డిమాండ్లతో హైకమాండ్​తలుపు తట్టారు.

మరోవైపు మెదక్, మేడ్చల్​జిల్లాల డీసీసీ ప్రెసిడెంట్లు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, నందికంటి శ్రీధర్ పార్టీని వీడారు. పార్టీ నేతలపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ హైకమాండ్ కమిటీ వేసి.. ఆదిలోనే అసంతృప్తిని చల్లార్చాలని నిర్ణయించింది.  ఈ కమిటీ విధివిధానాలపై చర్చించేందుకు సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఏం చేయాలన్న దానిపై చర్చించారు. 

కమిటీ ఏం చేస్తుంది? 

కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ల కోసం 1,006 అప్లికేషన్లు వచ్చాయి. సగానికి పైగా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున కీలక నేతలు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వారిలో ఎవరికి టికెట్​ఇచ్చినా మరో కీలక నేత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. అలాంటి చోట్ల అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీకి సవాల్​గా మారింది. ఆయా చోట్ల టికెట్​ దక్కని అసంతృప్తులను పిలిపించి బుజ్జగింపుల కమిటీ సభ్యులు చర్చిస్తారు. టికెట్​ఎందుకివ్వలేదో? గెలుపు సమీకరణాలేంటో? వివరిస్తారు. పార్టీ అధికారంలోకి వస్తే, అలాంటి వారికి అన్యాయం జరగకుండా తీసుకునే చర్యలనూ వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్తి వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని వివరించి, పార్టీ గెలుపుకు కృషి చేసేలా వారిని కన్వీన్స్​చేసేందుకు ప్రయత్నాలు చేస్తారని పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం 50 దాకా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని, ఇప్పుడు వాటిపైనే ఫోకస్​పెట్టారని తెలుస్తున్నది. మిగతా నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కుదిరినా, వాటిలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ కొందరు సీనియర్లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ దక్కని ఆశావహులనూ పిలిపించి మాట్లాడ్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు జనరల్ స్థానాల్లో టికెట్లు అడుగుతున్న ఎస్సీ, ఎస్టీలు.. ఉదయ్​పూర్​ డిక్లరేషన్​అమలు చేయాలంటున్న బీసీ నేతలు.. టికెట్లు ఆశిస్తూ ఇటీవల ఢిల్లీలో ఆందోళన చేసిన ఓయూ విద్యార్థి నేతలు, వివిధ అనుబంధ సంఘాల నేతలతోనూ చర్చలు జరుపుతారని అంటున్నారు. 

కమిటీ ఏర్పాటుపై భిన్న స్వరాలు..

బుజ్జగింపుల కమిటీ ఏర్పాటుపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు అసంతృప్తులతో ముందుగానే చర్చలు జరిపితే వినే అవకాశం ఉంటుందని పలువురు లీడర్లు చెబుతున్నారు. అసంతృప్తులు పార్టీని వీడకముందే చర్చలు జరిపితే కొంతలో కొంతైనా డ్యామేజ్​కంట్రోల్ చేసినట్టవుతుందని అంటున్నారు. మరికొందరు నేతలు మాత్రం ‘ఎవరు ఎంత బుజ్జగించినా అందరూ వినాలని లేదు కదా?’ అని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల పార్టీని వీడిన నందికంటి శ్రీధర్, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నందికంటి శ్రీధర్​తో ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడినా పార్టీని వీడకుండా ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్​లాంటి నాయకుడే బుజ్జగించినా వినకుంటే..  కమిటీ చెబితే వింటారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉండాలనుకునే నేతలు టికెట్ రాకపోయినా ఉంటారని, పోయేటోళ్లను ఆపినా ఆగరని అంటున్నారు.

జానాను యాక్టివ్​ చేసేందుకేనా? 

పార్టీలో ప్రస్తుతం జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ వంటి సీనియర్లు ఉన్నారు. అయితే జానారెడ్డి కొన్నాళ్లుగా యాక్టివ్​గా ఉండడం లేదు. ముఖ్యమైన మీటింగ్​లకు మాత్రం వచ్చిపోతున్నారు. జానారెడ్డి ఈసారి నాగార్జునసాగర్ నుంచి తన చిన్న కొడుకు జైవీర్​రెడ్డిని బరిలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి యాక్టివ్​గా ఉంటే పార్టీకి మేలు జరుగుతుందన్న రిపోర్టులు హైకమాండ్​కు వెళ్లినట్టు సమాచారం. అందుకే ఆయన్ను ఇటీవల హైకమాండ్​ఢిల్లీకి పిలిపించిందని తెలిసింది.

ఢిల్లీ వెళ్లిన ఆయనకు పార్టీలో యాక్టివ్​గా ఉండాలంటూ సూచించినట్టు సమాచారం. జానారెడ్డితో భేటీ అయిన ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే.. జానాకు తన రోల్​ గురించి వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను యాక్టివ్​గా ఉంచేందుకు పార్టీకి పెద్దలా అసంతృప్తులను బుజ్జగించే టాస్క్​ను అప్పగించినట్టు తెలుస్తున్నది. మరోవైపు తాను ఎంపీగా పోటీ చేస్తానని ఢిల్లీ వేదికగా జానారెడ్డి ప్రకటించారు.