ఆదిలాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా

ఆదిలాబాద్ కార్పొరేషన్ పై  కాంగ్రెస్ జెండా
  • చెన్నూర్, లక్సెట్టిపేట, నిర్మల్ మున్సిపాలిటీల్లో హస్తం గెలుపు
  • క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐకి మెజారిటీ
  • ఆదిలాబాద్​లో రెబల్సే కింగ్​మేకర్స్
  • 21 స్థానాల్లో గెలుపుతో ఆధిక్యంలో బీజేపీ.. బీఆర్ఎస్ ఆరు స్థానాలకే పరిమితం
  • ఆసిఫాబాద్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లిలో హంగ్.. ఇండిపెండెంట్లదే కీరోల్

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​సత్తా చాటింది. మంచిర్యాల కార్పొరేషన్​తోపాటు జిల్లాలోని చెన్నూరు, లక్సెట్టిపేటతోపాటు నిర్మల్​లో హస్తం అభ్యర్థులు మెజారిటీ స్థానాలను గెలుచుకున్నారు. 49 వార్డులున్న ఆదిలాబాద్ ​కార్పొరేషన్​లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 21 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక ఆసిఫాబాద్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లిలో హంగ్​ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కింగ్​మేకర్​గా మారనున్నారు. క్స్​అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి.  

మంచిర్యాల కార్పొరేషన్​లో 44 డివిజన్లలో కాంగ్రెస్

మంచిర్యాల కార్పొరేషన్​లో మొత్తం 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 44 డివిజన్లు గెల్చుకున్నది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 సీట్లకే పరిమితమయ్యాయి. ఏఐబీఎఫ్ 2, జనసేన 1 డివిజన్లలో విజయం సాధించాయి. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 31 కంటే ఎక్కువ సీట్లు గెల్చుకోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులు ఆ పార్టీకే దక్కనున్నాయి. చెన్నూరుతోపాటు లక్సెట్టిపేట మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. చెన్నూరులో 18 వార్డులకు గాను కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 2 సీట్లు సాధించగా, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. 

కాంగ్రెస్ సొంతంగానే 

చైర్​పర్సన్​ స్థానాన్ని దక్కించుకోనుంది. లక్సెట్టిపేట బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. మున్సిపాలిటీ లోని 15 వార్డుల్లో 11 స్థానాల్లో గెలిచింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తులో ఆ రెండు పార్టీలు కలిసి మెజారిటీ సీట్లు సాధించాయి.

 బెల్లంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ

బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ రెండు పార్టీలు సమానంగా 14 సీట్లు సాధించాయి. బీజేపీ ఒక స్థానానికి పరిమితం కాగా, ఐదు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో కౌన్సిల్ ఏర్పాటులో వారే కీలకమయ్యారు. ఇండిపెండెంట్లలో నలుగురు కాంగ్రెస్ రెబల్స్ ఆ పార్టీతో టచ్​లో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ కావడంతో కాంగ్రెస్ కౌన్సిల్ ఫామ్ చేయనుంది. రెండు పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించాయి. 

అందరి కృషితోనే బీజేపీ విజయం

ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని అత్యధిక స్థానాల్లో  బీజేపీని గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తల కృషితో, ప్రజల మద్దతూనే ఇంతటి విజయం సాధించామన్నారు. గెలుపొందిన పార్టీ అభ్యర్థులను క్యాంపులో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా ఆదిలాబాద్​ను తీర్చిదిద్దుతామని అన్నారు. 

నిర్మల్​లో కాంగ్రెస్ హవా 

నిర్మల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 42 వార్డులకు గాను 24 వార్డుల్లో గెలుపొంది చైర్​పర్సన్ పదవికి అవసరమయ్యే పూర్తి మెజారిటీ సాధించింది. దీంతో కాంగ్రెస్​ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 13 వార్డులకే పరిమితమైంది. ఎంఐఎం 3 వార్డుల్లో, బీఆర్ఎస్ 2 చోట్ల గెలిచింది. 

ఖానాపూర్​లో బీజేపీ 4, బీఆర్​ఎస్ ​4, కాంగ్రెస్​ 3

ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడనుంది. ఖానాపూర్​లో చెరో 4 వార్డులను బీజేపీ, బీఆర్ఎస్ దక్కించుకోగా కాంగ్రెస్ 3 చోట్ల గెలిచింది. ఇండిపెండెంట్​గా గెలిచిన సాజిదా బేగం వెంటనే కాంగ్రెస్​లో చేరారు. దీంతో ప్రధాన పార్టీల వద్ద చెరో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఎక్స్ అఫిషియో ఓటు కీలకం కానుంది.  

ఒకే ఒక్క సిట్టింగ్ కౌన్సిలర్ గెలుపు

ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో పలువురు మాజీ కౌన్సిలర్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మున్సిపల్ మాజీ చైర్​పర్సన్ రాజురా సత్యం ఒక్కరే గెలుపొందారు. ఆయన 11వ వార్డు నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నారాయణ పై 178 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సత్తా చాటారు.

కాగజ్​నగర్​లో ఇండిపెండెంట్లకు గాలం

కాగజ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మొత్తం 30 వార్డుల్లో బీఆర్ఎస్11, కాంగ్రెస్ 9, బీజేపీ 5, ఎంఐఎం 1 ఇండిపెండెంట్స్​4 సీట్లలో విజయం సాధించారు. దీంతో ఇండిపెండెంట్లకు మాజీ ఎమ్మెల్యే కోనప్ప గాలం వేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లు బీఆర్​ఎస్ ​క్యాంప్​కు చేరుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎంఐఎం అభ్యర్థి సహా, ఇండిపెండెంట్ల మద్దతుతో మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది.

ఆసిఫాబాద్​లోనూ హంగ్.. బీజేపీకి సున్నా

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. 20 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, ఇండిపెండెంట్లు 4 స్థానాలు దక్కించుకున్నాయి. 19 మంది అభ్యర్థులను బరిలో దించిన బీజేపీ ఒక్క చోట కూడా గెలవలేదు. మెజార్టీ మార్క్ ను చేరుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ తంటాలు పడుతున్నారు. ఇద్దరు  ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. కాగా 9 స్దానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ మెజార్టీ మార్క్ చేరుకునేందుకు మరో ఇద్దరు అవసరం. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ సైతం ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.

ఆదిలాబాద్​లో కారుకు పంక్చర్

ఆదిలాబాద్ పట్టణ ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టలేదు. ఉత్కంఠ భరితంగా విడుదలైన ఫలితాల్లో బీజేపీ అత్యధికంగా 21 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 11 వార్డుల్లో విజయం సాధించగా..  బీఆర్ఎస్ డీలాపడింది. కేవలం 6 స్థానాల్లో గట్టెక్కింది. మాజీ మంత్రి జోగు రామన్న కొడుకు తాజామాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఓటమిపాలయ్యారు. 2014 లో బీఆర్ఎస్ నుంచి చైర్​పర్సన్​గా చేసిన రంగినేని మనీషా కూడా ఓడిపోయారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 48 వార్డు నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక చేతిలో 34 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఎంఐఎం సత్తా చాటి 6 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలిచారు.

చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 26 స్థానాలు కావాలి. పీఠాన్ని  కైవసం చేసుకోవాలంటే బీజేపీకి మరో ఐదు ఓట్లు అవసరం. ఇందులో ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఓట్లు ఎక్స్ ఆఫీషియోగా బీజేపీకి వెళ్లనుండగా.. మరో ముగ్గురు కౌన్సిలర్లు తప్పనిసరి. దీంతో ఇండిపెండెంట్లుగా గెలిచిన వారి మద్దతు తప్పనిసరి. దీంతో ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ భారీ ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. టీటీడీసీ కేంద్రంలో జరిగిన ఓట్ల లెక్కింపును కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు.

భైంసాలో ఎంఐఎం.. బీఆర్​ఎస్​కు సున్నా

భైంసాలో ఎంఐఎం సత్తా చాటింది. మొత్తం 26 వార్డులకు గాను 12 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 6, స్వతంత్రులు 7 వార్డుల్లో గెలుపొందారు. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా.. బీఆర్​ఎస్​ఖాతా తెరవలేదు. ఇక్కడ స్వతంత్రులు ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ కౌన్సిల్​ను ఏర్పాటు చేయనుంది. బీజేపీకి స్వతంత్రులు మద్దతిస్తే ఆ పార్టీ బలం 13కు చేరి కౌన్సిల్​ఏర్పాటు చేస్తుంది. అలా కాకుండా ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతిస్తే మొత్తం 13 మంది కౌన్సిలర్ల మద్దతు ఆ పార్టీకి లభిస్తుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియోగా సభ్యులుగా బీజేపీకి మద్దతిస్తే ఫలితం ఆ పార్టీకి అనుకూలం కానుంది. దీంతో ఇక్కడి చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది.