తొలి విడత నామినేషన్లు షురూ.. మొదటి రోజు నామమాత్రంగా నామినేషన్లు

తొలి విడత నామినేషన్లు షురూ.. మొదటి రోజు నామమాత్రంగా నామినేషన్లు
  • పలు స్థానాల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ

మహబూబ్​నగర్, వెలుగు: మొదటి విడత సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్యాండిడేట్ల నుంచి రిటర్నింగ్​ ఆఫీసర్లు నామినేషన్లు తీసుకోగా.. నామినేషన్ల స్వీకరణ కోసం ఆఫీసర్లు మండలాల వారీగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మహబూబ్​నగర్​ జిల్లాలో ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా నవాబుపేట, గండీడ్​ మండలాల్లో 10 క్లస్టర్ల చొప్పున, మహబూబ్​నగర్​ రూరల్​లో ఏడు క్లస్లర్లు, రాజాపూర్​లో ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేసి నామినేషన్లు తీసుకుంటున్నారు.

నారాయణపేట జిల్లాలో నాలుగు మండలాల్లో మొదటి విడత ఎన్నికల జరగనుండగా.. ఇందులో గుండుమాల్, కోస్గి, కొత్తపల్లి మండలాల్లో ఐదు క్లస్టర్ల చొప్పున, మద్దూరులో తొమ్మిది క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లు తీసుకుంటున్నారు. తొలి రోజు నామమాత్రంగా నామినేషన్​లు దాఖలయ్యాయి. 

మండల స్థాయి లీడర్లదే బాధ్యత

ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఫైనల్​ చేయడం పార్టీలకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్​లో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముగ్గురు, నలుగురు టికెట్లను ఆశిస్తున్నారు. వీరిలో ఒకరిని ఎంపిక చేసి, మిగతా వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఆ పార్టీ గ్రామ స్థాయి లీడర్లతో వేర్వేరుగా రహస్య చర్చలు జరిపారు. 

ఈ చర్చల్లో కొన్ని గ్రామ పంచాయతీలకు ఫలానా క్యాండిడేట్​కు పార్టీ నుంచి మద్దతు ఇస్తున్నామని, మిగతా వారు రాజీకి రావాలని చెప్పారు. ఆ సమయంలో  రాజీకి ఒప్పుకున్న కొందరు లీడర్లు.. గురువారం మళ్లీ తాము పోటీకి దిగుతామని ప్రకటించడం పట్ల నియోజకవర్గ లీడర్లు సీరియస్​ అయినట్లు తెలిసింది. 

చివరకు క్యాండిడేట్లను తాము ఫైనల్​ చేయలేమని, మండల అధ్యక్షులే తమ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఎవరూ పోటీ చేస్తే గెలుస్తారో, వారి లిస్టును తయారు చేసి శుక్రవారం వరకు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆ పార్టీ వాట్సాప్​ గ్రూపుల్లో సర్పంచ్​ క్యాండిడేట్ల ఎంపిక మండల అధ్యక్షులకే అని పోస్టులు కూడా పెట్టినట్లు సమాచారం. బీఆర్ఎస్​ పార్టీలో మాత్రం లీడర్ల మధ్య పెద్దగా పోటీ లేదు. 

ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో క్యాండిడేట్లను ఫైనల్​ చేసినట్లు తెలిసింది. కొన్ని పంచాయతీల్లో ఇద్దరు, ముగ్గురు లీడర్లు పోటీకి ముందుకు వస్తుండడంతో నియోజజకవర్గ స్థాయి లీడర్లు రంగంలోకి దిగి, వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. రాజీకి రాని గ్రామ పంచాయతీల్లో స్థానిక లీడర్లే ఎవరినో ఒకరికి ఫైనల్​ చేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బీజేపీలో మాత్రం క్యాండిడేట్ల ఎంపికలో పెద్దగా ఇబ్బంది రావడం లేదు.

సర్పంచ్​ అభ్యర్థుల తరువాతే వార్డు మెంబర్లపై క్లారిటీ..

బీజేపీ మినహా ప్రధాన పార్టీల మద్దతుతో ఆయా గ్రామ పంచాయతీల నుంచి ఎవరూ పోటీ చేస్తారనే విషయం తేలాల్సి ఉంది. మొదటి విడత ఎన్నికలు జరిగే జీపీల్లో నామినేషన్​కు మరో రెండు రోజులే గడువు ఉండడంతో, వార్డు మెంబర్లుగా ఎవరూ పోటీ చేయాలనే దానిపై టెన్షన్​ నెలకొంది. వివిధ పార్టీల మద్దతుతో సర్పంచ్​గా పోటీ చేసే అభ్యర్థి, వార్డు మెంబర్లుగా ఎవరెవరిని బరిలోకి దింపాలనే దానిపై చర్చించాల్సి ఉంటుంది. తన ప్యానల్​ను తయారు చేసుకొని ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సర్పంచ్​గా ఎవరూ పోటీ చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న వారిలో గందరగోళం నెలకొంది.

జిల్లాల వారీగా తొలి రోజు నామినేషన్లు..

  • మహబూబ్​నగర్  జిల్లాలోని 139 గ్రామ పంచాయతీల్లో మొదటి రోజు సర్పంచ్​ స్థానాలకు108  నామినేషన్లు దాఖలయ్యాయి. 1,188 వార్డులకు 71 నామినేషన్లు వచ్చాయి.
  • నారాయణపేట జిల్లాలో 67 గ్రామ పంచాయతీలకు 69 నామినేషన్లు, 572 వార్డులకు 38 నామినేషన్లు వచ్చాయి.
  • నాగర్​కర్నూల్​ జిల్లాలో 151 గ్రామపంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించగా, సర్పంచ్ స్థానాలకు 121, వార్డులకు 26  నామినేషన్లు దాఖలయ్యాయి.
  • వనపర్తి జిల్లాలో 87 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహిస్తుండగా, సర్పంచ్​ స్థానాలకు 75, వార్డులకు 26 నామినేషన్లు వచ్చాయి.
  • జోగులాంబ గద్వాల జిల్లాలోని106 గ్రామపంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్​ స్థానాలకు 68, 974 వార్డులకు గాను 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.