మేడ్చల్​ కాంగ్రెస్ లో వర్గ పోరు

మేడ్చల్​ కాంగ్రెస్ లో వర్గ పోరు
  • జవహర్​నగర్​లో రెండుగా చీలిపోయిన నేతలు
  •     పార్టీ కార్యక్రమాల్లో ఎవరికి వారే విడిగా పాల్గొంటున్న నాయకులు
  •     అయోమయంలో కార్యకర్తలు 

జవహర్ నగర్, వెలుగు: మేడ్చల్ సెగ్మెంట్​లోని కాంగ్రెస్​ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎవరికి వారే విడిపోయి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో అయోమయానికి గురవుతున్న కార్యకర్తలు ఏ వర్గంతో కలిసి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని స్థానికులకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ గత నెల 26న తన వర్గంతో కలిసి జవహర్​నగర్​లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధికార ప్రతినిధి, మేడ్చల్ సెగ్మెంట్ కో ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిని సైతం ఆహ్వానించారు. అయితే, హరివర్ధన్​రెడ్డి హాజరుకాలేదు. అదేరోజు వజ్రేశ్ యాదవ్ ఆందోళన చేపట్టకముందే ఉదయం హరివర్ధన్ రెడ్డి తన వర్గంతో కలిసి జవహర్​నగర్​లోని అరుంధతి కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ముందు నిరసన చేపట్టారు.

 ఒకే సమస్యపై ఒకే రోజు కాంగ్రెస్​కు చెందిన ఈ ఇద్దరు నాయకులు వేర్వేరుగా  ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఇద్దరు నాయకులు పార్టీ నుంచి మేడ్చల్ సెగ్మెంట్ స్థానం టికెట్ ఆశిస్తూ ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వర్గపోరు కారణంగా కింది స్థాయి క్యాడర్ అయోమయానికి గురవుతోంది. ఎవరితో కలిసి వెళ్లాల్లో తేల్చుకోలేకపోతోంది. సమస్యపై కలిసి పోరాడితేనే పార్టీకి గుర్తింపు ఉంటుందని గుర్తించాల్సిన నాయకులే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.