- కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్...ఆటోలపై ఏకంగా రూ. 42 కోట్ల చలాన్లు విధించి, ఆటో డ్రైవర్లను ఆర్థిక ఇబ్బందులు పెట్టిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కానీ, ఇప్పుడు కేటీఆర్..ఆటోలో ప్రయాణించి ఆ వర్గాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. పదేండ్లలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించని కేటీఆర్...ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఎంపీ చామల గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.." బీఆర్ఎస్ లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదన్న రీతిలో కేటీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారు.
అతని మాయ మాటలు, దొంగ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలంగాణను దోచుకొని, పూర్తిగా అప్పులపాలు చేసి తాము ఏదో ఉద్దరించామనే రీతిలో మభ్యపెట్టే మాటలను కేటీఆర్ బంద్ చేయాలి. నీరు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటైన తెలంగాణలో నీళ్లు ఏమో కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లాయని, నిధులేమో ఆయన కుటుంబ సభ్యులే పంచుకున్నారని, ఇక పదవులు అన్ని వాళ్లకే వచ్చాయని వివరించారు. వీటిని గమనించే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని అన్నారు.
