జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు

జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు
  • పార్టీ మద్దతుతో పోటీలో  నిలబెట్టాలని కాంగ్రెస్​ నిర్ణయం
  • ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత
  • పంచాయతీల్లో బీసీలకు 50%  కోటా దాటాలని సీఎం ఆదేశాలు
  • పార్టీపరంగా అందుకు  తగ్గట్టు ప్రణాళికలు

హైదరాబాద్​, వెలుగు: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్​ విడుదలకు ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50 శాతం దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే.. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయించాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. 

ఇలా జనరల్​ స్థానాల్లోనూ బీసీలను పోటీ చేయించడం ద్వారా రిజర్వేషన్ల పరిమితిని అధిగమించొచ్చని, ఆ వర్గాలకు రాజకీయంగా 50 శాతానికిపైగా కోటా దక్కుతుందని భావిస్తున్నది. ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్​లో నిర్ణయించింది. ఇప్పుడు ఆ కోటాను మరింత పెంచే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. 

జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో అధికార పార్టీ మద్దతుతో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపే బాధ్యతను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్​ పార్టీ అప్పగించింది. అభ్యర్థుల ఎంపికలో  ఏకపక్ష నిర్ణయాలు ఉండొద్దని.. పక్కాగా స్థానిక పరిస్థితులను, సామాజిక సమీకరణాలను, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో ఉండేలా చూడాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. 

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్​ ప్రకారం ఎక్కడెక్కడ బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాలు దక్కాయో ఆ వివరాలను సేకరించే పనిలో పార్టీ నిమగ్నమైంది. ఈ సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి, రిజర్వేషన్లు లేని జనరల్ కేటగిరీ స్థానాల్లో బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నది. ఈ తరహా వ్యూహంతో బీసీ వర్గాలకు కేటాయించిన స్థానాలు, జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థుల సంఖ్య కలిపితే.. మొత్తంగా బీసీ ప్రాతినిధ్యం 50 శాతాన్ని మించిపోవాలని సీఎం భావిస్తున్నారు. 

కాగా, జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని అధికార పార్టీ భావిస్తుండటంతో ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసేందుకు బీసీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఆశావహులు తమ రాజకీయ పలుకుబడిని, స్థానిక సామాజికవర్గాల్లో ఉన్న తమ ప్రభావాన్ని ఉపయోగించి.. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.