గంజాయి మత్తులో దాడులు..!  ‌‌హత్యలు చేసేందుకూ వెనుకాడని మత్తుబాబులు

గంజాయి మత్తులో దాడులు..!  ‌‌హత్యలు చేసేందుకూ వెనుకాడని మత్తుబాబులు
  • ‌‌హత్యలు చేసేందుకూ వెనుకాడని మత్తుబాబులు
  • ‌‌రోజుకో చోట ఘర్షణలు, దాడులతో హల్ చల్
  • రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నామంటున్న పోలీసులు
  • తగ్గని ఘటనలు, వాడకం

ఖమ్మం, వెలుగు:  జిల్లాలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది. గంజాయి మత్తు, మద్యం మత్తు కలిసిన తర్వాత జరుగుతున్న గొడవలు రోజూ సంచలనంగా మారుతున్నాయి. తరచూ ఏదో ఒక చోట గంజాయి తాగిన మత్తులో యువకులు గొడవలు పడడం, ప్రత్యర్థులపై దాడులు చేయడం, ఎదురుచెప్పిన వారిని, ప్రశ్నించిన వారిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. దీంతో జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న విషయాలకూ తీవ్రంగా స్పందిస్తూ దాడులు చేస్తూ, తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎదుటివారి జీవితాలను కూడా బలితీసుకుంటున్నారు. రెగ్యులర్ గా ఎక్సైజ్​ ఆఫీసర్లు, పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నది గోరంతేనని, ఎక్కువ మొత్తంలో గంజాయి వినియోగం ఉంటోందని చెప్పడానికి ఇటీవల బయటపడుతున్న ఘటనలే రుజువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు మైనర్లతోపాటు, ఇంటర్, ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్స్​కూడా ఈ మత్తుకు బానిసలుగా మారారని సమాచారం. మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో కూడా కొందరు స్టూడెంట్స్​రెగ్యులర్ గా గంజాయిని సిగరెట్లలో పెట్టుకొని తాగుతున్న ఆనవాళ్లు బయటపడడం పేరెంట్స్​లో ఆందోళన కలిగిస్తోంది. ఇక కూలీ పనులు చేసుకునేవారు కూడా గంజాయి తీసుకునే వారిలో ఉన్నారు. ఖమ్మం నగరంలో స్లమ్​ ఏరియాలు, పాత బస్టాండ్, త్రీటౌన్​మార్కెట్ ఏరియాల్లో గంజాయి గుట్టుగా వినియోగిస్తున్నారని సమాచారం. 

ALSO READ :గెలుపు గుర్రాలకే అసెంబ్లీ టికెట్లు : ఎంపీ ధర్మపురి అర్వింద్​

ఇటీవలి ఘటనల్లో కొన్ని..

  • ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ లో రెండు వారాల క్రితం గంజాయి మత్తులో ఇద్దరు యువకులపై, మరో ఇద్దరు సర్జికల్ బ్లేడ్​తో దాడి చేశారు. బండిపై స్లోగా వెళ్లాలని చెప్పినందుకు ఈ ఘటన జరిగింది. గొడవలో సాయి పవన్ అనే యువకుడు చనిపోగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. 
  • మూడ్రోజుల క్రితం ఖమ్మం గోపాలపురం సమీపంలో పక్కపక్కనే ఉన్న రెండు షాపులవారు గొడవపడ్డారు. ఈ గొడవలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి మహిళను గాయపరిచిన యువకులు గంజాయి మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. శనివారం రాత్రి చిన్న గొడవ జరగ్గా, ఆ తర్వాత రోజు మహిళ, ఆమె పిల్లలపై కావాలనే దాడి చేసినట్లు తెలిసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కర్రలతో దాడి చేశారు. 
  • ఖమ్మంలో సీక్రెట్ గా గంజాయి తాగడం, బైక్ లపై విపరీత శబ్దాలు చేస్తూ అర్ధరాత్రి వరకు స్పీడ్ గా చక్కర్లు కొట్టడం కామన్​గా మారింది. ఎవరైనా అడ్డు చెప్పినా, అడ్డుకున్నా వారిపై దాడులు చేస్తుండడంతో భయపడుతున్నారు. శ్రీశ్రీ సర్కిల్, బైపాస్, మమత రోడ్డు, పంపింగ్ వెల్ రోడ్​లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. 
  • ఖమ్మంలో రాత్రిపూట డ్యూటీలు చేసేవారిపైనా కొందరు యువకులు కత్తులతో దాడి చేసిన ఘటనలున్నాయి. రైల్వే ట్రాక్​పై పనిచేస్తున్న సిబ్బందిపై కత్తులతో కొందరు దాడి చేసినట్టు 
  • ఫిర్యాదులున్నాయి. 
  •  ఖమ్మం జిల్లాలో గత నెలరోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, రైల్వే పోలీసులు కలిపి క్వింటాల్​న్నర వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
  • ఛత్తీస్ గఢ్, ఒడిశాతోపాటు ఏపీలోని ఏజెన్సీ ఏరియా నుంచి ఖమ్మం జిల్లాకు గంజాయి సప్లయ్​అవుతోంది. టూ వీలర్లు, కార్లు, లారీలు, ట్రక్కుల్లో రవాణా సాగుతోంది. కూరగాయలతో పైన కవర్ చేస్తూ కింద బాక్సుల్లో సీక్రెట్ గా సప్లయ్​చేస్తూ కొందరు, పుష్ప సినిమా తరహాలో ట్రక్కుల్లో ప్రత్యేక సీక్రెట్ ఛాంబర్లను ఏర్పాటు చేసి మరికొందరు, కారు డిక్కీలు, సీటు కింద దాచి ఇంకొందరు తరలిస్తున్నారు. రైళ్లలోనూ తనిఖీల సమయంలో పలుమార్లు గంజాయిని గుర్తించారు. 
  • పెనుబల్లి మండలంలో యువకులు ఎక్కువగా గంజాయి వాడుతున్నారు. మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఇటీవల గంజాయి తాగిన బాటిల్స్, సిగరెట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. పాడుబడ్డ షాదీఖానా దగ్గర యువకులు గంజాయి వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో మండలానికి చెందిన యువకులు గంజాయిని బైక్ పై తీసుకువెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 
  • ముదిగొండ మండలంలో కోదాడ- కురవి నేషనల్​హైవే నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉండగా, వారు రెగ్యులర్ గా గంజాయి వాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. 
  •  గ్రామాల్లోనూ యువకులకు, స్టూడెంట్స్​కు విచ్చలవిడిగా గంజాయి లభిస్తోందన్న ఆరోపణలున్నాయి. స్మగ్లర్లు ఆర్టీసీ బస్సుల ద్వారా సప్లయ్​చేస్తుండడం విశేషం. ఇటీవల ఛత్తీస్ గఢ్​నుంచి హైదరాబాద్​కు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని వైరాలో పట్టుకున్నారు.