అమెరికాలో కరోనా కలకలం.. ఒక్కరోజే లక్షన్నర కేసులు 

V6 Velugu Posted on Aug 04, 2021

  • మాస్కులు వద్దన్న ముచ్చట మూన్నాళ్లకే పరిమితం 

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో అంటే ఒక్కరోజే దాదాపు లక్షన్నర కేసులు నమోదు కావడం భయాందోళనలు సృష్టిస్తోంది. కరోనాను కట్టడి చేసేశాం... ఇక మాస్కులే అవసరం లేదు.. మునుపటి వలే స్వేచ్ఛగా ఉందాం.. అంటూ మాట్లాడిన అధ్యక్షుడు జోబైడెన్.. తాజా పరిస్థితితో ఎదురవుతున్న సవాల్ ను ఎదుర్కొనేందుకు కిందా మిందా అవుతున్నారు. ఈ ఏడాదిలో గత  ఫిబ్రవరి నెల తర్వాత  మళ్లీ అంత భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతోపాటు మరణాలు పెరుగుతుండడం  కలకలం రేపుతోంది. 
ప్రపంచ వ్యాప్త కేసుల్లో అమెరికాలోనే ఎక్కువ
ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఒక్క అమెరికా నుండే వస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతోంది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో అమెరికాలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు సంభవించడంతో అమెరికా చిగురుటాకులా వణికిపోయింది. 
ముఖ్యంగా అమెరికాలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో ఎక్కువ భాగం కేసులు ఫ్లోరిడా, టెక్సాస్‌ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. మూడో వంతు కేసులు ఈ రాష్ట్రాల్లోనివే ఉంటున్నాయి. అమెరికా ఆరోగ్య సంస్థ తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో 1లక్షా 49వేల 788 కేసులు, 668 మరణాలు  నమోదు అయ్యాయి. దీంతో మొత్తం  కరోనా కేసుల సంఖ్య 3.53 కోట్లకు, మొత్తం మృతుల సంఖ్య 6.14లక్షలకు చేరుకుంది. 
వ్యాక్సిన్ వేయించుకుంటే 100 డాలర్లు
అమెరికాలో తాజాగా కరోనా కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడమే కారణమని వైద్య నిపుణుల విశ్లేషణ. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించినా పరిస్థితి మారడం లేదు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకుంటే 100 డాలర్లు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 30లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. అలాగే 18 ఏళ్లు పైబడిన 70శాతం మందికి కనీసం ఒక్కడోసును అందించగలిగామని అధికారులు ప్రకటించినా కేసులు పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వ్యాక్సిన్ పై అనుమానాలు, అపోహలతో ఉన్న సుమారు 9 కోట్ల మందికి ఎలా వ్యాక్సిన్ వేయించాలన్న దానిపై దృష్టి సారించారు. 
మళ్లీ ఆంక్షల  మొదలు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాయి. నిన్నమొన్నటి వరకు మాస్కులు అవసరం లేదని ప్రకటించిన పలు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇంట్లో కూడా మాస్కులు వాడమని సూచిస్తున్నాయి. అంతే కాదు. జిమ్ లు.. రెస్టారెంట్లకు వెళ్లే వారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని ప్రకటించాయి. అంతే కాదు.. మాస్కులు ధరించడం.. భౌతిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేకాదు పరిస్థితి అదుపులోకి రాకపోతే మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలను పరిశీలిస్తామన్న హెచ్చరికలు చేయడం ప్రారంభించాయి. 

Tagged US president Joe Biden, , USA covid updates, america covid 19 updates, USA covid latest updates, Covid-19 spread in USA

Latest Videos

Subscribe Now

More News