- కార్మిక చట్టాలను బీజేపీ నిర్వీర్యం
- తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్
- సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: పేదల పక్షాన సీపీఐ వందేండ్లుగా పోరాటాలు చేస్తోందని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్టౌన్ సూపర్ బజార్ చౌరస్తాలో సీపీఐ వందేండ్ల ముగింపు ఉత్సవాల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దున్నేవాడికి భూమి నినాదంతో పాటు సమ సమాజ స్థాపన సీపీఐ ఆవిర్భవించి పోరాటాలు చేస్తోందన్నారు.
స్వాతంత్ర్య, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లోనూ పార్టీ కీలకపాత్ర పోషించిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌తో గెలిచిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని, దీనిపై స్వయంగా కేసీఆర్ బిడ్డే చెబుతుందని ఆయన విమర్శించారు. దేశంలో వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
